సంబురాల్లో సింగరేణి కార్మికులు

సింగరేణి బొగ్గు గనులపై గులాబీ గుభాలించడంతో కార్మికులు సంబురాల్లో మునిగి తేలారు. మంచిర్యాల జిల్లా కార్మికలోకం సంబురాల్లో మునిగిపోయింది. శ్రీరాంపూర్ ఏరియాలో రెండు వేలకు పైగా మెజారిటీ రావడంపై.. కార్మికులు, టీబీజీకేఎస్ నేతలు పటాకులు పేల్చారు. ఈ సంబురాల్లో ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే దివాకర్ రావు పాల్గొన్నారు. సింగరేణి చరిత్రలోనే అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు కార్మికులకు ఎంపీ బాల్కసుమన్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతీ హామీని సీఎం కేసీఆర్ సహకారంతో అమలు చేస్తామన్నారు.

ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సంబరాలు అంబరాన్నంటాయి. కార్మికులు పటాకులు పేలుస్తూ స్వీట్లు తినిపించుకుంటూ విజయాన్ని అస్వాదించారు. ఆ తర్వాత పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే కోరం కనకయ్యతో పాటు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీ సీతారాం నాయక్ పాల్గొన్నారు. ఏఐటీయూసీ కంచుకోట అయిన ఇల్లందులో టీబీజీకేఎస్ గెలిచి చరిత్ర సృష్టించిందన్నారు. టీబీజీకేఎస్  గెలుపు కోసం కృషి చేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ఫలితాలు సీఎం కేసీఆర్‌ పాలనకు నిదర్శనమన్నారు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. సీఎం కేసీఆర్‌తోనే వారసత్వ ఉద్యోగాలు వస్తాయని నమ్మిన కార్మికులు టీబీజీకేఎస్‌కు పట్టం కట్టారని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో టీబీజీకేఎస్‌ విజయం సాధించడంతో కార్మికులంతా సంబురాలు చేసుకున్నారు. ఈ ఫలితాలతోనైనా విపక్షాలు బుద్ది తెచ్చుకోవాలని హితవు పలికారు.

సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్‌ కు విజయం కట్టబెట్టిన కార్మికులందరికీ ఎంపీ పొంగులేటీ శ్రీనివాస్‌ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కొత్తగూడెంలోని 5 షార్ప్‌, 6 షార్ప్‌, 7 షార్ప్‌ గనుల్లో పర్యటించి కార్మికులకు కృతజ్ఙతలు చెప్పారు. అనైతిక పొత్తులు పెట్టుకున్న జాతీయ సంఘాలకు కార్మికులు మరోసారి బుద్ధి చెప్పారన్నారు. రానున్న సార్వత్రిక అసెంబ్లీ ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలే పునరావృతం అవుతాయని ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా.. టీఆర్‌ఎస్‌దే విజయమని మరో స్పష్టమైందన్నారు ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పిడమర్తి రవి. సింగరేణి ఎన్నికల్లో 9 డివిజన్లలో టీబీజీకేఎస్‌ గెలుపుపై ఆయన హర్షం వ్యక్తం చేసారు. కార్మికులకు ఇచ్చిన హామీలకు సీఎం కేసీఆర్‌ కట్టుబడి ఉన్నారని స్పష్టం చేసారు. కార్మికుల బతుకులకు సీఎం కేసీఆర్‌ భరోసా కల్పించడంతో కార్మికులు టీబీజీకేఎస్‌కు పట్టం కట్టారని టీఆర్‌ఎస్‌ కార్మిక విభాగం జనరల్‌ సెక్రటరీ నారాయణ చెప్పారు. ఈ గెలుపు విపక్షాలకు చెంపపెట్టులాంటిదన్నారు.

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుబంధ సంఘమైన టీబీజీకేఎస్ గెలుపుపై కరీంనగర్ లో సంబురాలు మిన్నంటాయి. నగరంలోని తెలంగాణ చౌక్ లో టీఅర్ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర నాయకులు రూప్ సింగ్, జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మెన్ రవీందర్ రెడ్డి  ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు పటాకులు కాల్చి, స్వీట్లు పంచి పెట్టారు.