శరవేగంగా కాళేశ్వరం ప్రాజెక్టు పనులు

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా  నిర్మిస్తున్న కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుకు  అటవీ శాఖ  అనుమతులను మంజూరు చేసింది.  పర్యావరణ శాఖ అనుమతులు ఇప్పటికే లభించగా, ఇప్పుడు అటవీ అనుమతులను కూడా  మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  కేంద్ర అటవీ మంత్రిత్వశాఖ పరిధిలోని అటవీ అడ్వయిజరీ కమిటి.. ఎఫ్‌ఏసీ సూత్రప్రాయ ఆమోదం తెలుపుతూ  మినిట్స్‌ ను జారీ చేసింది. దీంతో  ఈ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో సుమారు 7వేల 820 ఎకరాల అటవీశాఖ భూమిని వినియోగించుకునేందుకు ఉన్న  అడ్డంకి తొలిగిపోయింది.

రాష్ట్రంలో వందలాది కిలోమీటర్లు ప్రవహిస్తున్న గోదావరి నదీ జలాలను పూర్తి స్థాయిలో  వినియోగించుకొనేందుకు.. సీఎం కేసీఆర్‌ ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతంగా చేపట్టారు. ఉత్తర తెలంగాణలో నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు గోదావరి నీటిని అందించాలన్న ఉద్దేశంతో కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేసి శరవేగంగా నిర్మాణ పనులను చేపట్టారు. అయితే ప్రాజెక్టు నిర్మాణానికి 80 వేల ఎకరాల భూసేకరణతో పాటు  7 వేల 820 ఎకరాల అటవీ భూమిని తీసుకోవాల్సి ఉంటుంది. ఒక వైపు భూసేకరణతో పాటు అటవీశాఖ అనుమతులు తీసుకొనేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అయితే ఎలాంటి అనుమతులు లేకుడానే ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపడుతున్నారంటూ.. భూసేకరణ ప్రక్రియను సవాల్‌ చేస్తూ.. కొందరు  కేసులు వేశారు. హైకోర్టు, జాతీయ హరిత ట్రిబ్యునల్‌ లో కూడా కేసులు వేశారు. వీటిని సమర్థంగా ఎదుర్కొవడంతోపాట.. అటవీ శాఖ అనుమతులు తీసుకునేందుకు  ప్రభుత్వం  కృషి చేసింది. సెప్టెంబర్‌ 21న ఎన్‌ ఎఫ్‌సీ ఎదుటహాజరై.. అటవీ భూములకు ప్రత్యామ్నయ భూముల వివరాలు… వాటి స్థానాల్లో అడవులను అభివృద్ధి చేసేందుకు చర్యలను ప్రభుత్వం  నివేదించింది. హెక్టారుకు 1600 మొక్కలు పెంచడానికి నిధులను ఇవ్వడం.. అటవీ జంతువుల సంచారానాకి ఇబ్బందులు లేకుండా చేపట్టే చర్యలను వివరించింది. ప్రభుత్వ వివరణను పరిగణనలోకి తీసుకొన్న ఎఫ్‌ఏసీ అటవీ అనుమతులు ఇవ్వడానికి అంగీకారం తెలిపింది. ఇక ఎకోసెన్సిటివ్‌ జోన్‌ నుంచి అటవీశాఖ భూములను మినహాయించాలంటూ ప్రభుత్వ అభ్యర్థనను సైతం అంగీకరించింది. అయితే ప్రస్తుతం కోర్టులు, ట్రిబ్యునళ్లలో ఉన్న కేసుల్లో తీర్పులకు లోబడి నిబంధనలు వర్తిస్థాయని స్పష్టం చేసింది.

ప్రాజెక్టు నిర్మాణినికి అనుమతుల నేపథ్యంలో వినియోగానికి అనుమతించిన అటవీ భూములకు సరిహద్దులు నిర్ణయించే ప్రక్రియను త్వరలో చేపట్టనున్నారు. అటవీ భూములు అప్పచెప్పినందుకు గాను  ప్రత్యామ్నాయ భూములు ఇవ్వడం, ఆయా భూముల్లో  మొక్కల  పెంపకం, జంతు పరిరక్షణ కోసం అవసరమయ్యే  చర్యలను చేపట్టడంతో పాటు, నిధులను కూడా  త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేయనున్నది.