వ్యవసాయానికి 24 గంటల విద్యుత్‌ సరఫరా

వ్యవసాయానికి 24 గంటల పాటు నిరంతరాయంగా కరెంటు సరఫరా చేసి… అన్నదాతల కష్టాలు తీర్చాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష. ఆ దిశగా సర్కారు తగిన చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే మూడు జిల్లాల్లో చేపట్టిన ప్రయోగం విజయవంతమవడంతో  తెలంగాణ వ్యాప్తంగా దాన్ని అమలు చేసేందుకు సన్నద్ధమవుతోంది. ఇందుకుగానూ విద్యుత్‌ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. 12 వేల కోట్ల వ్యయంతో కొత్త సబ్  స్టేషన్లు, లైన్లు, ట్రాన్స్ ఫార్మర్లు అందుబాటులోకి తెచ్చింది. వాటి వివరాలను జెన్ కో సీఎండీ ప్రభాకర్‌ రావు… సీఎం కేసీఆర్‌ కు వివరించారు. 24 గంటల పాటు కరెంటు అందించేందుకు విద్యుత్ సంస్థలు చేసిన ప్రయత్నాలను తెలియజేశారు. తెలంగాణ ఆవిర్భవించిన ఐదో నెల నుంచే… రాష్ట్రంలో గృహ, వాణిజ్య, పరిశ్రమల అవసరాలకు 24 గంటలు విద్యుత్ సరఫరా అవుతోందని చెప్పారు. వ్యవసాయానికి పగటి పూట 9 గంటల కరెంటు ఇస్తున్నామని తెలిపారు.

వ్యవసాయ రంగానికి 24 గంటల పాటు కరెంటు ఇచ్చేందుకు విద్యుత్ శాఖ అన్ని ఏర్పాట్లు చేసిందని ప్రభాకర్ రావు తెలిపారు. ఇప్పటికే పాత మెదక్, కరీంనగర్, నల్లగొండ జిల్లాల పరిధిలోని పంపు సెట్లకు… ప్రయోగాత్మకంగా నిరంతర విద్యుత్‌ సరఫరా జరుగుతోందన్నారు. వచ్చే ఫిబ్రవరి నుంచి రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ పంపు సెట్లకు 24 గంటల పాటు కరెంటు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. సప్లై సక్రమంగా జరగాలంటే పంపిణీ వ్యవస్థ పటిష్టంగా ఉండాలని… అందుకోసం కొత్త సబ్ స్టేషన్లు, లైన్లు, ట్రాన్స్ ఫార్మర్లు వేసినట్టు చెప్పారు. వ్యవసాయానికి 24 గంటల కరెంటు, ఎత్తిపోతల పథకాలు, మిషన్‌ భగీరథ, కొత్త పరిశ్రమలకు కరెంటు సరఫరా చేస్తే మరో 50 శాతం అదనంగా సప్లై చేయాలని తెలిపారు. ఉత్పత్తి గణనీయంగా పెరుగుతున్నందున పంపిణీ వ్యవస్థను విస్తరించినట్టు తెలిపారు. అటు, ప్రభుత్వ సంకల్పాన్ని నెరవేర్చేందుకు గానూ అతి తక్కువ సమయంలో అన్ని ఏర్పాట్లు చేసిన జెన్ కో సీఎండీ ప్రభాకర్‌ రావు, ఇతర అధికారులు, సిబ్బందిని సీఎం కేసీఆర్‌ అభినందించారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అందించే మొదటి, ఏకైక రాష్ట్రంగా తెలంగాణ కొత్త చరిత్ర సృష్టిస్తుందని సంతోషం వ్యక్తం చేశారు.

వ్యవసాయంతో పాటు అన్ని రంగాలకు 24 గంటల కరెంటు ఇవ్వడానికి దాదాపు 13 వేల మెగావాట్ల విద్యుత్ సరఫరా  చేయగల సామర్థ్యం కలిగిన 400 కెవి సబ్ స్టేషన్లు అవసరం. దీనికోసం  విద్యుత్ శాఖ కొత్తగా 9 సబ్ స్టేషన్లు నిర్మిస్తోంది. ఇప్పటికే సూర్యాపేట, నర్సాపూర్, అసుపాక, డిండి, మహేశ్వరంలో 3,980 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఐదు 400 కెవి సబ్ స్టేషన్ల నిర్మాణం పూర్తి చేసింది. జూలూరు పాడు, నిర్మల్, కేతిరెడ్డిపల్లి, జనగామల్లో 3705 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మరో నాలుగు సబ్ స్టేషన్ల నిర్మాణం జరుగుతున్నది. ఈ మేరకు సూర్యాపేట సమీపంలోని చివ్వెంల శివారులో 1600 కోట్లతో నిర్మించిన సబ్  స్టేషన్ ను సీఎం కేసీఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. తద్వారా వ్యవసాయానికి 24 గంటల పాటు కరెంటు ఇస్తున్నట్టు అధికారికంగా ప్రకటించనున్నారు.