విపక్షాలు గుడ్డిగా వ్యతిరేకిస్తున్నాయి

రాష్ట్ర ప్రభుత్వం ఏ మంచి కార్యక్రమం తీసుకున్నా గుడ్డిగా వ్యతిరేకించడం విపక్షాలకు అలవాటుగా మారిందని ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ మండిపడ్డారు. హైదరాబాద్ లోని టిఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏడాది కిందట కొత్త జిల్లాలను ఏర్పాటు చేసినప్పుడు కాంగ్రెస్ గుడ్డిగా వ్యతిరేకించిందని, దాన్ని మిగతా విపక్షాలు అనుసరించాయని కర్నె గుర్తుచేశారు. ఏడాదిలోపే కొత్త జిల్లాల్లో సమీకృత పరిపాలన భవనాలకు శంకుస్థాపన చేయడం సీఎం కేసీఆర్ పట్టుదలకు నిదర్శనం అన్నారు. కాంగ్రెస్ పార్టీ దీన్ని జీర్ణించుకోలేకపోతోందని అన్నారు.

ప్రతి దానికి కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని కర్నె విమర్శించారు. తమ భూములు ఉన్నచోట ప్రాజెక్టులు పెట్టుకోవడం కాంగ్రెస్ నేతలకు అలవాటేనని, టిఆర్ఎస్ నేతలు కూడా అలాగే చేయాలని వారు కోరుకున్నట్టుగా ఉందన్నారు. కానీ, అభివృద్ధి కోసం తమ నాయకులు ఆస్తులను త్యాగాలు చేస్తున్నారని చెప్పారు. ముచ్చర్ల ఫార్మా సిటీకి అందరికంటే ముందుగానే మంత్రి హరీశ్ రావు తన 17 ఎకరాల భూమి ఇచ్చి భూసేకరణకు సహకరించారని ప్రభాకర్ గుర్తుచేశారు. ప్రస్తుత మంత్రి ఈటెల రాజేందర్ ఎనిమిది ఎకరాల భూమిని కాంగ్రెస్ హయాంలో ఔటర్ రింగ్ రోడ్డు కోసం లాక్కుని కాంగ్రెస్ నేతలు రాక్షసానందం పొందారని విమర్శించారు. ఇప్పటికీ రాజేందర్ దానికి నష్ట పరిహారం తీసుకోలేదన్నారు.

సూర్యాపేటలో కొందరు దాతలు ముందుకొచ్చినందువల్లే కుడకుడ భూముల్లో కలెక్టరేట్ కడుతున్నామని కర్నె ప్రభాకర్ వెల్లడించారు. సరైన కారణాలు చూపకుండా కాంగ్రెస్ నేతలు దాన్ని వ్యతిరేకించడం సరికాదన్నారు. ప్రజలు కొత్త జిల్లాలను స్వాగతించినట్టే కొత్త నిర్మాణాలను కూడా స్వాగతిస్తున్నారని చెప్పారు. ప్రజలతో పాటు కాంగ్రెస్ నేతలు నడిస్తే మంచిదని, గుడ్డిగా వ్యతిరేకించడం మానాలని హితవు చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ప్రాజెక్టులకు శంఖుస్థాపనలు జరిగి సంవత్సరాలు గడిచినా నిర్మాణాలు జరిగేవి కావని, వారి హయాంలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ టిఆర్ఎస్ పాలనలో రన్నింగ్ ప్రాజెక్టులుగా మారాయన్నారు. పాలమూరులో ఐదు లక్షల ఎకరాలకు నీరిచ్చిన ఘనత టిఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు.

నిన్న సూర్యాపేటలో జరిగిన ప్రగతి సభకు తరలివచ్చిన ప్రజలకు ప్రభాకర్  ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ వెంట తామున్నామనే సందేశాన్ని ప్రజలు బహిరంగ సభ ద్వారా చాటిచెప్పారని అన్నారు.