విత్తన భాండాగారంగా మార్చడమే లక్ష్యం

రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా మార్చడమే లక్ష్యంగా ముందుకెళుతున్నామని తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు చెప్పారు. సీడ్ ప్రొడక్షన్, క్వాలిటీ కంట్రోల్ అండ్ మార్కెటింగ్ పై తెలంగాణ రాష్ట్ర సీడ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సోమాజిగూడలోని పార్క్ హోటల్ లో జరిగిన జాతీయ సదస్సులో ఆయన మాట్లాడారు.

రైతులకు నాణ్యమైన విత్తనాలను తక్కువ ధరకు అందించటమే లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహించామని కోటేశ్వరరావు చెప్పారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతోందన్నారు. సీఎం కేసీఆర్ దిశా నిర్ధేశంతో విత్తనోత్పత్తిలో రాబోయే రోజుల్లో దేశంలోనే నెంబర్ వన్ గా నిలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎరువుల విషయంలో రైతులకు మరింత చేయూతనందించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.

మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా నేషనల్ సీడ్ కార్పొరేషన్, రాష్ట్ర సీడ్ కార్పొరేషన్ ద్వారా రైతులకు ఎరువులను అందించాలనే లక్ష్యంతో ఈ సమావేశం నిర్వహించామని రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి పార్ధసారథి తెలిపారు. రైతులకు మరింత తక్కువ ధరకు నాణ్యమైన ఎరువులను అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని ఆయన వివరించారు.

గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ తో పాటు వివిధ రాష్ట్రాల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు.