వరంగల్ ఔటర్ కు 20న శంకుస్థాపన

వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ఈ నెల 20న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శంకుస్థాపన చేయనున్నారు. పరిపాలన అనుమతులు ఇవ్వడంతో పాటు శంఖుస్థాపనకు అంగీకరించిన ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఇతర ప్రజా ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. వరంగల్ ఓఆర్ఆర్ నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయించడంలోనూ, అంచనాలు రూపొందించడంలోనూ కడియం శ్రీహరి చొరవ తీసుకున్నారని సీఎం కేసీఆర్ అభినందించారు. అదే స్ఫూర్తితో నిర్మాణ పనులను కూడా పర్యవేక్షించాలని కోరారు. కడియం శ్రీహరితో పాటు ఎమ్మెల్సీ కొండా మురళి, ఎమ్మెల్యే కొండా సురేఖ కూడా సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

రూ.669 కోట్ల అంచనా వ్యయంతో వరంగల్ ఓఆర్ఆర్ కు అధికారులు అంచనాలు రూపొందించారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా ఒకవైపు నుంచి ఓఆర్ఆర్ నిర్మాణం జరుగుతుండగా, మరోవైపు నుంచి రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఓఆర్ఆర్ పనులు చేయనున్నారు.