వచ్చే ఎన్నికల్లో అన్ని సీట్లు గెలుస్తాం!

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే 2019 ఎన్నికల్లో కూడా వస్తాయని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో వార్‌ వన్‌ సైడ్‌ అవుతుందని, అన్ని సీట్లు గెలుస్తామని చెప్పారు. హైదరాబాద్‌ లో పార్టీని మరింత బోలపేతం చేస్తామన్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో నగర టిఆర్ఎస్ నాయకులతో మంత్రులు నాయిని, తలసాని శ్రీనివాస యాదవ్ సమావేశమయ్యారు. ఓటర్ల నమోదుకు ఈ నెల 15 వరకు ఎన్నికల కమిషన్ గడువు పెంచడంతో నగర నాయకులకు దిశా నిర్దేశం చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. సామాజిక బాధ్యతగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. హోంమంత్రి నాయిని. ఇందుకోసం ఇప్పటికే బూత్ కమిటీలు కూడా ఏర్పాటు చేశామన్నారు.

హైదరాబాద్‌ ను విశ్వనగరంగా అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని నాయిని చెప్పారు. త్వరలోనే ప్రధాని చేతుల మీదుగా మెట్రోరైలును ప్రారంభించబోతున్నామని తెలిపారు. ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రోడ్లు, జంక్షన్లు విస్తరిస్తున్నామని, ఫ్లై ఓవర్లు, స్కై వేలు కడుతున్నామని వివరించారు.

ఓటర్‌ నమోదు ప్రక్రియను నగర ప్రజలు ఉపయోగించుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ కోరారు. ఎన్నికలప్పుడు ఇబ్బంది పడకుండా ఇప్పుడే జాగ్రత్త పడటం మంచిదన్నారు.

ఓటరు నమోదు ప్రక్రియలో మంత్రుల సూచనలకు అనుగుణంగా పనిచేస్తామని గ్రేటర్‌ హైదరాబాద్ ప్రజాప్రతినిధులు చెప్పారు. అర్హులైన ప్రతీఒక్కరూ ఓటు నమోదు చేసుకునేలా అవగాహన కల్పిస్తామన్నారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే గోపీనాథ్, నగర డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దిన్, టిఆర్ఎస్ కార్పొరేటర్లు, నగర నాయకులు పాల్గొన్నారు.