రాష్ట్రమంతా జోరువాన

వర్షాలు తెలంగాణ రాష్ట్రాన్ని వీడడం లేవు. ఎక్కడ చూసినా.. వర్షాలు దంచికొడుతున్నాయి.  హైదరాబాద్‌తో పాటు అన్ని  జిల్లాల్లోనూ కుండపోత వర్షం కురుస్తోంది. వాగులు, వంకలు కూడా వరద నీటితో  పొంగిపొర్లుతున్నాయి.  

నిజామాబాద్‌ జిల్లా ఇందల్వాయి మండలంలోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో చిరుజల్లులు పడ్డాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, షాద్ నగర్లో ఉరుములతో కూడిన వర్షం కురిసింది. అటు పెద్దపల్లి పట్టణం, జూలపల్లి, కాల్వ శ్రీరాంపూర్‌ మండలాల్లో మోస్తరు వర్షం పడింది. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో వాన దంచికొట్టింది. ఇటు నాగర్‌ కర్నూల్‌ జిల్లా ఊర్కొండ, ఉప్పునుంతల మండలాల్లో భారీ వర్షం కురిసింది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, పినపాక నియోజకవర్గాల్లో వాన పడింది. ముల్కలపల్లి మండలంలో మోస్తరు వర్షం కురిసింది. ఖమ్మం నగరంలో చిరుజల్లులు పడ్డాయి. అటు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ, జగిత్యాల జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురిసింది. ఇక వరంగల్‌ అర్బన్‌ జిల్లా వరంగల్‌, హన్మకొండ లో వాన దంచి కొట్టింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ములుగు, తాడ్వాయి, ఏటూరు నాగారం, మంగపేట, మండలాల్లో జోరు వాన కురిసింది. మహబూబాబాద్‌ జిల్లా తొర్రూర్‌, పెద్దవంగర, కే సముద్రం, నెల్లికుదురు, మహబూబాబాద్‌ మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోనూ వర్షాలు దంచి కొడుతున్నాయి. భువనగిరి, రామన్నపేట, చిట్యాల, వలిగొండ ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. జనగామ జిల్లా జఫర్‌ గఢ్‌లో కుండపోత వాన కురిసింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌, అక్కన్నపేట, కోహెడ మండలాల్లో జోరు వర్షం పడింది.

ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇవాళ రాష్ర్టంలోని దాదాపు అన్ని జిల్లాల్లో వర్షం పడే అవకాశాలున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయన్నారు. ఇదిలా వుండగా మరో మూడు రోజుల్లో  నైరుతి రుతుపవనాలు నిష్క్రమిస్తాయని, అదే సమయంలో ఈశాన్య రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించే అవకాశం ఉందన్నారు. ఈ దశలో మరో మూడురోజుల వరకు ఓ మోస్తరు వానలు పడే అవకాశముందన్నారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఈ నెల 15 వరకు అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, అదే జరిగితే వర్షాలు మళ్లీ పుంజుకుంటాయని తెలిపారు.