రాజన్న సిరిసిల్ల జిల్లాలో పరువుహత్య

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పరువు హత్య జరిగింది. ప్రేమ వివాహం చేసుకున్నదని ఓ యువతిని, ఆమె భర్తను యువతి మేనమామలు దారుణంగా నరికి చంపారు. వేములవాడ మండలం బాలరాజుపల్లిలో ఈ దారుణం జరిగింది.

జిల్లాలోని చందుర్తి మండలం రామన్నపేట గ్రామానికి చెందిన రచన.. కొన్ని నెలల కిందట తల్లిదండ్రులు చనిపోవడంతో బాలరాజుపల్లిలోని మేనమామల ఇంటికి వచ్చింది. అదే గ్రామానికి చెందిన హరీశ్ తో ప్రేమలో పడింది. ఈ విషయంలో మేనమామలు హెచ్చరించినా పట్టించుకోలేదు. గత ఆగస్ట్ 9న వీరిద్దరు కొండగట్టులో పెళ్లి చేసుకొని వేములవాడ పోలీసులను ఆశ్రయించారు. హరీశ్, రచన ఇద్దరూ మేజర్లు కావడంతో వారితో పాటు వారి కుటుంబాలకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అప్పటి నుంచి బాలరాజుపల్లిలో ఉంటున్న కొత్త జంటపై కక్ష పెంచుకున్న రచన మేనమామలు ఇవాళ దారుణంగా హత్య చేశారు.

ఘటనా స్థలాన్ని వేములవాడ రూరల్ పోలీసులు పరిశీలించి, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. హంతకుల కోసం రెండు బృందాలతో గాలింపు చేపట్టారు. రాజన్న సిరిసిల్ల ఎస్పీ విశ్వజిత్ కూడా ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతుల కుటుంబాలకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. సీనియర్ పోలీస్ ఆఫీసర్లతో కేసు దర్యాప్తు చేయిస్తామన్నారు.