రాంచీలో టీమిండియా ఘన విజయం

సొంతగడ్డపై టీమిండియా జోరు కొనసాగుతోంది. రాంచీ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఆసీస్ పై ఘన విజయం సాధించింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్ లో టీమిండియా ఆల్ రౌండ్ ప్రదర్శనతో అలరించింది. వర్షం వల్ల గంట పాటు మ్యాచ్ కు అంతరాయం కలగటంతో భారత్ లక్ష్యాన్ని 6 ఓవర్లలో 48 పరుగులకు కుదించారు. లక్ష్య ఛేదనలో మరో మూడు బంతులు మిగిలుండగానే గ్రాండ్ విక్టరీ కొట్టింది.

అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆసీస్..  భారత బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ ఫించ్ ఒంటరి పోరాటం చేసినా… మిగతా బ్యాట్స్ మెన్లంతా ఘోరంగా విఫలం అయ్యారు. స్పిన్నర్లు కుల్దీప్,చాహల్ సూపర్ బౌలింగ్ తో మరోసారి ఆసీస్ ను కట్టడి చేశారు. పేసర్లు బూమ్రా, భువీలు సైతం సత్తా చాటారు. దీంతో ఆసీస్ భారీ స్కోర్ చేయలేకపోయింది. ఆసీస్ ఇన్నింగ్స్ లో  ఫించ్ 42 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా, మ్యాక్స్ వెల్, పైనే  తలో 17 పరుగులు చేశారు. మిగితా బ్యాట్స్ మెన్లలో ఒక్కరూ డబుల్ డిజిట్ దాటలేకపోయారు. టీమిండియా బౌలర్లలో కుల్దీప్, బూమ్రాలు తలో రెండు వికెట్లు తీయగా.. భువీ, పాండ్యా, చాహల్ ఒక్కో వికెట్ పడగొట్టారు. ఆస్ట్రేలియా 18.4 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 118 పరుగులు ఉన్నప్పుడు వర్షం రావడంతో మ్యాచ్ కు అంతరాయం కలిగింది. సుమారు గంటపాటు వర్షం కురవడంతో భారత లక్ష్యాన్ని  6 ఓవర్లలో 48 పరుగులకు కుదించారు

48 పరుగుల లక్ష్య ఛేదనలో ఓపెనర్ రోహిత్ ఓ ఫోర్, సిక్సర్ తో 11 పరుగులు చేశాడు. రెండో ఓవర్ రెండో బంతికి కల్టర్‌ నైల్ బౌలింగ్ లో రోహిత్  బౌల్డ్ అయ్యాడు. ధావన్ కు జతైన కోహ్లీ స్కోర్ బోర్డును పరుగెత్తించాడు.  దీంతో టీమిండియా 5.3 ఓవర్లలో 48 పరుగులు చేసింది. మరో మూడు బంతులు ఉండగానే గ్రాండ్ విక్టరీ కొట్టింది. కోహ్లీ 14 బంతుల్లో 3 ఫోర్లతో 22, ధావన్ 12 బంతుల్లో 3 ఫోర్లతో 15 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు.అద్భుత బౌలింగ్ తో ఆకట్టుకున్న  కుల్దిప్ యాదవ్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది. ఈ విజయంతో 3 టీ20 సిరీస్ లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో టీ20 ఈ నెల 10 గౌహాతీ వేదికగా జరగనుండగా.. 13న  జరిగే చివరి టీ20కి హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది