యుద్ద ప్రాతిపదికన రోడ్ల మరమ్మతులు

క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో మరో రెండ్రోజులు భారీవర్షాలు ఉంటాయన్న వాతావరణ విభాగం హెచ్చరికల నేపథ్యంలో అధికార యంత్రాంగాన్ని మంత్రి కేటీఆర్‌ అప్రమత్తం చేశారు. భారీ వర్షాలవల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సోమవారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలు, సహాయ చర్యలపై మంత్రి సచివాలయంలో సమీక్షించారు.

వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, జలమండలి చురుకుగా సహాయచర్యలు నిర్వహిస్తున్నాయన్నారు మంత్రి కేటీఆర్‌. 140 మాన్‌సూన్ ఎమర్జెన్సీ, యాభై స్టాటిక్ బృందాలు నిరంతరం సహాయచర్యలు చేపడుతున్నాయన్నారు. నీళ్లు నిలిచిన ప్రాంతాల్లో కాల్వలు, నాలాలను క్లియర్ చేస్తున్నారని చెప్పారు. జీహెచ్‌ఎంసీలో ఏర్పాటుచేసిన కంట్రోల్‌రూమ్‌ద్వారా నగరంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం సీసీటీవీలు, డయల్ 100, జీహెచ్‌ఎంసీ కాల్‌సెంటర్, మై జీహెచ్‌ఎంసీ యాప్ ద్వారా వస్తున్న ఫిర్యాదులపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. భారీ వర్షాలకు పాడైన రోడ్లను వెంటనే పునరుద్ధరించాలని జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్ సిబ్బందికి సూచించారు. రానున్న రెండ్రోజులపాటు వర్షాలు పడనున్న నేపథ్యంలో అధికారులంతా మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు మంత్రి కేటీఆర్‌. విరిగిపడిన భారీవృక్షాలను తొలిగించి, వెంటనే విద్యుత్తు సరఫరా పునరుద్ధరించేందుకు విద్యుత్ శాఖతో సమన్వయం చేసుకోవాలన్నారు. విద్యుత్ షాక్‌కు గురై మరణించిన వ్యక్తికి విద్యుత్‌శాఖ ద్వారా రూ.4 లక్షల పరిహారం, గోడ కూలి మరణించిన ఇద్దరికి జీహెచ్‌ఎంసీ తరఫున రూ. 2 లక్షల పరిహారం అందజేసినట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు.
భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, జలమండలి, పోలీస్‌శాఖలు ముందుచూపుతో వ్యవహరించడంవల్ల నగరంలో ప్రాణనష్టం పెద్దగా జరుగలేదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. వర్షాలు నిలిచిపోగానే యుద్ధప్రాతిపదికన రోడ్ల మరమ్మతుల కోసం దాదాపు 500 కోట్లు వెచ్చిస్తామని చెప్పారు. హైదరాబాద్‌లో 300 కిలోమీటర్ల మేరకు వైట్ టాపింగ్ రోడ్లను అభివృద్ధి చేస్తామన్నారు. ట్రాఫిక్ అంతరాయం, రోడ్లు దెబ్బతినడంతో ప్రజలు కొంత అసౌకర్యానికి గురైన మాట వాస్తవమేనన్నారు. వర్షాలవల్ల కలిగే అసౌకర్యాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తిచేశారు. భారీ వర్షాల్లో ప్రజలకు ఇబ్బంది కలుగకుండా జీహెచ్‌ఎంసీ, వాటర్‌బోర్డు, పోలీసు అధికారులు, సిబ్బంది శక్తివంచన లేకుండా కృషిచేస్తున్నారంటూ మంత్రి అభినందించారు. సోమవారం రాత్రి నుంచి భారీవర్షం కురిసినా మంగళవారం ఉదయానికే నగరం సాధారణ స్థితికి వచ్చిందంటే అధికారులు, కిందిస్థాయి సిబ్బంది విశేషంగా కృషిచేయడం వల్లే సాధ్యమైందని చెప్పారు. ఇలాంటి కుంభవృష్టి పడినప్పుడు కొంత అసౌకర్యానికి గురవుతుంటామని అన్నారు. ఇలాంటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి సీఎం కేసీఆర్‌ దృష్టి సారిస్తున్నారని చెప్పారు. హైదరాబాద్‌లో డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరిస్తామని.. ఇందుకోసం ట్రెంచ్‌లెస్‌వంటి పరిజ్ఞానాన్ని వినియోగించడానికి ప్రణాళికలు రచిస్తున్నామని తెలిపారు. ఆలోచనలతో, జాగ్రత్తగా.. అధికారులతో కలిసి సమన్వయంతో ఈ పనిని చేపట్టాల్సిన అవసరముందన్నారు. పట్టణ ప్రాంతాల్లో దాదాపు 42శాతం ప్రజలు నివసిస్తున్నారని, పెరుగుతున్న నగరానికి అనుగుణంగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.

అటు లోతైన మ్యాన్‌ హోల్స్‌ ఉన్నచోట ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీని మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు. ప్రస్తుతమున్న కాల్ సెంటర్‌కు అదనంగా 9989996948 ఫోన్ నంబరుతో ఎమర్జెన్సీ సెల్ ఏర్పాటు చేశారు. కంట్రోల్‌ రూంలో మూడు షిఫ్టుల్లో ముగ్గురు జీఎంలు, ఇద్దరు డీజీఎంలు, ముగ్గురు మేనేజర్లు ఉండాలన్నారు. నీళ్లు నిండిన ప్రాంతాల్లో క్లోరిన్ మాత్రలతో పాటు జలమండలి తరఫున వాటర్‌ పాకెట్లు సరఫరా చేస్తున్నారు.