ముగిసిన సింగరేణి ఎన్నికల ప్రచారం

సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈనెల 5న పోలింగ్ జరగనుంది. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ నిర్వహిస్తారు. అదేరోజు రాత్రి ఏడుగంటల నుంచి ఓట్లను లెక్కిస్తారు. ఈ ఎలక్షన్ లో 53 వేల 148 మంది కార్మికులు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ కు  సంబంధించి సింగరేణి యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. ఎలక్షన్ కు సంబంధించి ఎక్కడా ఇబ్బంది తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అంతకుముందు వారం రోజుల పాటు సాగిన సింగరేణి ఎన్నికల ప్రచారంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం హవా స్పష్టంగా కనిపించింది. జాతీయ సంఘాలన్నీ ఏకమైనా టీబీజీకేఎస్ ముందు నిలవలేకపోయాయి. కార్మికులంతా గులాబీ జెండాకే పట్టం కడతామని తేల్చిచెప్పడంతో.. ఆయా సంఘాలు ప్రచారంలోనే చేతులెత్తేశాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లోనూ టీబీజీకేఎస్ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమనే వాదన బలంగా వినిపిస్తోంది.