మిషన్ కాకతీయ పనుల నాణ్యతలో రాజీ లేదు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ కాకతీయ పనుల నాణ్యతలో రాజీ పడరాదని ఇరిగేషన్ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఒకరిద్దరు చేసే తప్పుల వల్ల మొత్తం కార్యక్రమానికి మచ్చ వస్తుందన్నారు. మిషన్ కాకతీయ కార్యక్రమంపై హైదరాబాద్ లోని జలసౌధ నుంచి ఆన్ లైన్ ద్వారా మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలు, మండలాల వారీగా మిషన్ కాకతీయ 1,2,3 దశలలో నడుస్తున్న పనులను సమీక్షించారు. ఈ నెల 26 న మిషన్ కాకతీయపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని మంత్రి ప్రకటించారు.

మిషన్ కాకతీయ-1 పనులను ఈ నెలాఖరులోగా వంద శాతం పూర్తి చేయాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. ఎం.కె. కింద మంజూరై ప్రారంభించిన పనుల్లో ఇంకా అక్కడక్కడ కొన్నిచోట్ల, కొన్ని పనులు పూర్తి కాకపోవడం పట్ల మంత్రి విస్మయం వ్యక్తం చేశారు. ఎం.కె. 2 కింద చేపట్టిన పనులను డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని ఆదేశించారు. ఎం.కె. 3వ దశలో చేపట్టిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని హరీశ్ రావు ఆదేశించారు. ఆయా పనుల పురోగతిని ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో అప్ లోడ్ చేయాలని హరీశ్ రావు ఆదేశించారు.

మిషన్ కాకతీయ 4 వ విడత చేపట్టనున్న పనులను గుర్తించి, ప్రతిపాదనలను ఈ నెలాఖరులోగా సిద్ధం చేసి పంపించాలని మంత్రి హరీశ్ రావు కోరారు. ఎలాంటి లోపాలు లేకుండా, మళ్ళీ సవరణలకు, మార్పులు, చేర్పులకు అవకాశం లేకుండా, సంబంధిత చెరువుల పునరుద్ధరణకు గాను నిజంగా అవసరమైనవి అనుకున్న పనులకే అంచనాలు రూపొందించాలని చెప్పారు. మిషన్ కాకతీయ కింద చేపట్టవలసిన పనుల ఎంపిక, అంచనాలు రూపొందించడం, నిర్మాణ పనులు, పనులు పూర్తయ్యాక కొలతల నమోదు, బిల్లుల మంజూరు తదితర అన్నీ విషయాల్లోనూ కిందిస్థాయి జె.ఈ. మొదలుకొని చీఫ్ ఇంజనీర్ వరకు అన్నివేళలా అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.

దేశ విదేశాల నుంచి ప్రశంసలు అందుతున్న మిషన్ కాకతీయ పనులలో చిన్న చిన్న పొరపాట్లు, అవతవకలు లేకుండా చూడాలని మంత్రి హరీశ్ రావు కోరారు. నాణ్యతా ప్రమాణాలపై కొన్ని చెరువుల గురించి ఇటీవల వచ్చిన వార్తలను మంత్రి ప్రస్తావించారు. క్వాలిటీ విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆయన ఆదేశించారు. ఈ వ్యవహారంలో ఎవరినీ ఉపేక్షించరాదని మంత్రి అన్నారు. సి.ఈ., ఎస్.ఈ. లు క్షేత్రస్థాయిలో వెళ్ళి మిషన్ కాకతీయ పనులను నిరంతరం పర్యవేక్షించాలని కోరారు. నిర్మాణ పనులపై నాణ్యతా విభాగం ఎస్.ఈ, సి.ఈ. లు అకస్మిక తనిఖీలు చేయాలని హరీశ్ రావు ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో పనులను సందర్శించకుండా ఆఫీసుల్లో కూర్చొని సంతకాలు చేసే సంప్రదాయానికి స్వస్తి చెప్పాలని స్పష్టం చేశారు.

ఎం.కె. కింద చేపట్టే చెరువుల పునరుద్ధరణలో భాగంగా హరితహారం కార్యక్రమాన్ని కూడా అనుసంధానం చేసి చెరువు కట్టకు ఇరువైపులా మొక్కలు నాటాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. ఇందుకు గాను సంబంధిత శాఖల సహకారం తీసుకోవాలని సూచించారు. తెలంగాణలోని మొత్తం చెరువులకు జియో ట్యాగింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు.

ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్.కె. జోషి, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ వికాస్ రాజ్, కాడా కమిషనర్ డాక్టర్ మల్సూర్, ఈ.ఎన్.సి. నాగేందర్ రావు, సి.ఈ. లు శ్యామ్ సుందర్, సురేశ్ కుమార్, ఎస్.ఈ.లు, ఈ.ఈ. లు పాల్గొన్నారు.