మహిళల ఆర్థిక సాధికారతతోనే అభివృద్ధి

మరో అంతర్జాతీయ సదస్సుకు హైదరాబాద్ వేదిక అవుతోంది. వచ్చే నెల (నవంబర్) 28 నుంచి 30 వ తేదీ వరకు హెచ్ఐసిసిలో గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్స్ సమ్మిట్-2017 జరగనుంది. ఈ సదస్సుని విజయవంతం చేసేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలతో పాటు అమెరికాకు చెందిన ఉన్నత స్థాయి అధికారులు హైదరాబాద్ లో ఏర్పాట్లలో నిమగ్నం అయ్యారు. ఈ సదస్సుకు ప్రధాన మంత్రి న‌రేంద్ర మోడి, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక ట్రంప్ ప్రసిడెంట్ కు సలహాదారు హోదాలో యుఎస్ ప్రతినిధిగా హాజరుకాబోతున్నారు. సదస్సులో వివిధ దేశాల నుంచి మూడు వేల మంది పారిశ్రామికవేత్తలు పాల్గొంటారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వ్యాపార ప్రముఖులు, ఇన్వెస్టర్లు, ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్తలు వారి ఆలోచ‌న‌ల‌ను వెల్లడించ‌డం, భాగ‌స్వామ్యాల‌ను నెల‌కొల్పుకోవ‌డం, నిధుల‌ను సమకూర్చుకోవ‌డంతో పాటు వ‌స్తువులను మ‌రియు సేవ‌లను ఆవిష్క‌ రించ‌నున్నారు.  నెట్‌ వ‌ర్కింగ్‌, మెంటరింగ్,  వ‌ర్క్ షాప్‌ ఈ గ్లోబ‌ల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్ లో  జరగనున్నాయి. ఈ సదస్సులో ఔత్సాహిక మహిళా పారిశ్రామిక‌వేత్తలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ప్రపంచంలోని ఉత్తమ ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్తల‌తో క‌లసి ప‌ని చేయ‌డానికి, వారితో స‌మ‌న్వయాన్ని ఏర్పచుకోవ‌డానికి భార‌తీయ స్టార్ట్‌-అప్ ల‌కు మ‌రియు ఇన్నోవేట‌ర్లకు ఇది మంచి అవ‌కాశ‌మ‌ని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్  అన్నారు.

గ్లోబ‌ల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్-2017 నిర్వహ‌ణ‌కు భార‌త‌దేశంతో భాగ‌స్వామ్యాన్ని ఏర్పరుచుకోవడం యునైటెడ్ స్టేట్స్ కు గ‌ర్వ‌ కార‌ణంగా ఉంద‌ని అమెరికా జాతీయ భ‌ద్రత మండ‌లి సీనియ‌ర్ డైరెక్టర్ జెన్నిఫ‌ర్ అరంగియో అన్నారు. ఈ స‌ద‌స్సు కోసం ప్రధానంగా  ‘విమెన్ ఫ‌స్ట్, ప్రాస్పరిటీ ఫ‌ర్ ఆల్‌’ పేరుతో ప్రత్యేక ఏర్పాటు చేయనున్నారు. మ‌హిళ‌లు ఆర్థికంగా సాధికార‌త‌ను సంపాదించుకొంటేనే దేశాలు అభివృద్ధి చెందుతాయనే సూత్రానికి ట్రంప్ పాల‌నా యంత్రాంగం క‌ట్టుబ‌డి ఉందన్నారు అరంగియో. గ్లోబ‌ల్ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సమ్మిట్-2017 ను భార‌త‌దేశంలో నిర్వహించ‌నుండ‌టం రెండు దేశాల మ‌ధ్య భాగ‌స్వామ్యం విస్తరించి స్థిరంగా  ఉంటుందని జెన్నిఫ‌ర్ అరంగియో అభిప్రాయపడ్డారు.