మనదేశంలోనే ఉద్యోగ అవకాశాలు ఎక్కువ!

విదేశాల్లో కంటే మన దేశంలోనే ఎక్కువ ఉద్యోగావకాశాలు ఉన్నాయంటోంది యువత. ఈ మేరకు దేశంలో ఉద్యోగార్థుల అభిప్రాయాలపై టైమ్స్ జాబ్స్ ఓ సర్వే నిర్వహించింది. తమ డ్రీమ్ జాబ్ ఇండియాలోనే దొరుకుతోందని మెజారిటీ యువత అభిప్రాయ పడింది.

చదువు పూర్తి కాగానే ఉద్యోగం వెతుక్కోవడం కామన్. అయితే ఎలాంటి ఉద్యోగం చేయాలనే విషయంలో ఒక్కొక్కరిదీ ఒక్కో అభిప్రాయం. ఇక చదువును బట్టి కొందరు దేశంలోనే ఉద్యోగం చేస్తుండగా కొందరు మాత్రం విదేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. దీనిపై టైమ్స్ జాబ్స్ ఓ సర్వే నిర్వహించింది. దీని ప్రకారం ఉద్యోగానికి సంబంధించి తమ కల నెరవేరే అవకాశం దేశీయంగానే లభిస్తోందని 60 శాతం మంది ఉద్యోగార్థులు చెబుతున్నారు. మరో 40 శాతం మంది మాత్రం ఉపాధి కోసం విదేశాలకు తరలి వెళ్తున్నారని టైమ్స్‌ జాబ్స్‌ సర్వే తేల్చింది. 1,100 మంది ఉద్యోగార్థుల నుంచి సేకరించిన అభిప్రాయాలతో ఈ నివేదిక రూపొందించారు.

పురుషుల్లో అత్యధికులు ఇంజినీరింగ్‌ పై ఆసక్తి చూపిస్తుండగా.. మహిళలు వైద్య విద్య వైపు వెళుతున్నారు. పురుషుల్లో 25 శాతం మంది వైద్యులుగా లేదా ఆరోగ్య సంరక్షణ రంగంలో ఉపాధి ఆశిస్తున్నారు. ఐటీ రంగంపై 20 శాతం, చార్టర్డ్‌ అకౌంటెంట్లుగా స్థిరపడాలని 15 శాతం, న్యాయవాదిగా మారాలని 10 శాతం మంది కోరుకుంటున్నట్లు సర్వే పేర్కొంది. ఇక మహిళల్లో 25 శాతం మంది సీఏలుగా మారాలని, ఐటీపై 20శాతం మంది, ఇంజినీరింగ్‌ పై 15 శాతం, మానవ వనరుల విభాగాల్లో పనిచేయాలని 10 శాతం  మంది మహిళలు ఆశిస్తున్నారు. మొత్తానికి చూస్తే ఉద్యోగార్థుల్లో 35 శాతం ఐటీ రంగంపై ఆసక్తిగా ఉండగా.. ఆరోగ్య సంరక్షణలో 30 శాతం, తయారీ రంగంలో 30శాతం మంది ఆసక్తి చూపుతున్నారు. ఇక బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, బీమా రంగాలపై 20 మంది, రవాణాపై 16శాతం మంది మక్కువ చూపుతున్నారు. రిటైల్‌, ఐటీ ఆధారిత సేవలపై చెరో 15 శాతం ఉండగా.. ఎఫ్‌ఎంసీజీపై 10శాతం ఆసక్తిగా ఉన్నారు.

తాము కోరుకున్న కంపెనీలో ఉద్యోగం పొందలేని వారు 70శాతం మంది ఉన్నారు. 25 శాతం మంది ఉపాధికి సంబంధించి తమ కలలను వదిలేసుకున్నట్లు వివరించారు. ప్రస్తుతం తాము చేస్తున్న ఉద్యోగం మాత్రం తమ కల నెరవేర్చేది కాదని 55 శాతం మంది పేర్కొన్నారు. ఇక ఉద్యోగంలో హోదా తమకు తగినది కాదని పురుషుల్లో 65 శాతం మంది, మహిళల్లో 75 శాతం మంది తెలిపారు.