భూరికార్డుల ప్రక్షాళనలో నల్లగొండ నెం.1

నల్లగొండ జిల్లాలో పక్కాగా భూముల లెక్కలు తేలుతున్నాయి. భూ రికార్డుల  ప్రక్షాళనలో నెంబర్ వన్ స్థానంలో దూసుకుతున్నది నల్లగొండ జిల్లా. ఇక్కడి రెవెన్యూ యంత్రాంగం అంకిత భావంతో, రేయింబవళ్ళు కష్టపడుతూ భూ రికార్డుల ప్రక్షాళన శరవేగంగా పరుగులు పెట్టిస్తున్నారు. గత నెల 28వ తేది నాటికే  మొదటి విడుత నవీకరణను పూర్తి చేసి, రాష్ట్రంలోనే ముందంజలో నిలిచారు జిల్లా అధికారులు. ప్రస్తుతం రెండవ విడుత కార్యక్రమం కూడా దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఇప్పటివరకు లక్షా యాభై వేల  సర్వే నెంబర్ లలో రెండున్నర లక్షల ఎకరాల రికార్డులను సరి చేశారు. చాలా గ్రామాలను ఎర్రర్ ఫ్రీ గ్రామాలుగా తీర్చిదిద్దారు జిల్లా రెవెన్యూ అధికారులు. అటు జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ ఎప్పటికప్పుడు రివ్యూలు, కాన్ఫరెన్స్ లు, ఆకస్మిక తనఖీలు నిర్వహిస్తూ భూరికార్డుల ప్రక్షాళనను జెట్ స్పీడ్ తో పూర్తి చేయిస్తున్నారు.

జిల్లాలో పకడ్బందీ ప్రణాళికతో రెండవ దశ భూప్రక్షాళన జరుగుతోంది. ప్రతి గ్రామంలో ఎన్ని సర్వే నెంబర్ లలో భూములు ఉన్నాయి? ఎంత భూమి ఉంది? అందులో వ్యవసాయ, వ్యవసాయేతర భూములు ఎన్ని ఉన్నాయి? పట్టాదార్లు ఎంత మంది? వారి పేర్ల మీద  అంతా సజావుగా ఉందా లేదా? అన్న వివరాలను పరిశీలిస్తున్నారు. ఇందులో కొత్తవి, వింత సమస్యలు కూడా రెవెన్యూ యంత్రాంగం దృష్టికి వస్తున్నాయి. నక్రేకల్ , దేవరకొండ, పెద్ద ఊర మండలాల్లో కాందిశీకుల భూ సమస్యలు అధికారుల దృష్టికి వచ్చాయి. దీంతో కలెక్టర్ ఎప్పటికప్పుడు ప్రభుత్వంతో చర్చలు జరిపి, సమస్యల్ని పరిష్కరిస్తున్నారు. అటు ఇతర సమస్యలేవైనా ఉంటే రెవెన్యూ సిబ్బంది, పైఅధికారుల సూచనలు తీసుకుని పరిష్కరిస్తున్నారు. మరోవైపు బతుకుదెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు, విదేశాల్లో స్థిరపడ్డవారు సైతం.. కంట్రోల్ రూంకు ఫోన్ చేసి, వివరాలు తెలుసుకుంటున్నారు. సర్వే జరిగే రోజున హాజరై, తమ భూముల వివరాలు నమోదు చేయించుకుంటున్నారు. భూప్రక్షాళనకు జనమంతా సహకరిస్తుండటంతో అధికారులకు కూడా పని సులువు అవుతోంది. సంతోషంగా ప్రతి పట్టాదారు సమస్యల్ని తీరుస్తూ ముందుకు పోతున్నరు. గ్రామసభల్లో ఆమోదం పొందిన తర్వాతే ఆన్ లైన్లో వివరాలను పొందుపరుస్తున్నారు.

నల్లగొండ జిల్లాలో మొత్తం 566 గ్రామాలు ఉన్నాయి. అందరికంటే ముందుగా జిల్లాలో ప్రయోగాత్మకంగా భూరికార్డుల ప్రక్షాళన చేపట్టారు. మిర్యాలగూడ మండలం ముల్కల కాల్వ గ్రామంలో సర్వేను తక్కువ సమయంలోనే పూర్తి చేసి రాష్ట్రానికే రోల్ మోడల్ గా నిలిచిందీ జిల్లా. మొదటి విడుతగా 70 గ్రామాల్లో 70 రెవెన్యూ టీంలు సర్వే నిర్వహించాయి. కేవలం పది రోజుల్లోనే భూప్రక్షాళన కార్యక్రమం పూర్తైంది. మూడు రోజులుపాటు గ్రామాల్లోనే బస చేసి, అక్కడున్న ప్రజలతో మమేకమై పనిని పూర్తి చేశారు రెవెన్యూ అధికారులు. రెండవ దశ భూప్రక్షాళనలో సైతం జిల్లా అధికారులు ముందంజలో ఉన్నారు. కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. భూప్రక్షాళన కార్యక్రమాన్ని పకడ్బందీగా, ప్రణాళికాబద్దంగా ముందుకు తీసుకుపోవడం వల్లనే.. రాష్ట్రంలోనే నల్లగొండ జిల్లా నెంబర్ వన్ స్థానంలో ఉందని కలెక్టర్ గౌరవ్ ఉత్పల్‌ చెప్పారు.. నల్లగొండ జిల్లాలో భూప్రక్షాళన కార్యక్రమానికి రైతులు, ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోంది. అందరూ సహకరిస్తుండటంతో రెవెన్యూ సిబ్బంది రెట్టింపు ఉత్సాహంతో పనిని పూర్తి చేస్తున్నారు. రాష్ట్రానికే రికార్డుల నవీకరణను ముందుకు తీసుకెళ్తున్న జిల్లా రెవెన్యూ యంత్రాంగాన్ని  అందరూ అభినందిస్తున్నరు.