బ్రహ్మాండంగా ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ధి

ప్రాణాలను ఫణంగా పెట్టి కష్టపడి సాధించుకున్న తెలంగాణను ఇష్టపడి అభివృద్ధి చేసుకుంటున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. రాబోయే రోజుల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయని భరోసా ఇచ్చారు. సూర్యాపేటలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం, జిల్లా పోలీస్ కార్యాలయాలకు శంకుస్థాపన చేసిన తర్వాత పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రగతి సభలో ఆయన మాట్లాడారు.

మూడున్నరేళ్ల కిందట ఇదే ప్రాంగణంలో జరిగిన ఎన్నికల సభలో సూర్యాపేటను జిల్లా చేస్తానని హామీ ఇచ్చానని, దాన్ని నెరవేర్చానని సీఎం కేసీఆర్ చెప్పారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో రైతులు మీసం మెలేసి రెండు పంటలు పండించుకునేలా కాళేశ్వరం నుంచి నీళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు.

రూ.24,995 కోట్ల ఖర్చుతో దామరచర్లలో నిర్మించే యాదాద్రి అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్ట్   ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ అని సీఎం కేసీఆర్ చెప్పారు. అది పూర్తయితే ఉమ్మడి నల్గొండ జిల్లా రూపురేఖలు మారిపోతాయన్నారు. అత్యధిక బోర్లు వున్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో నాగార్జున సాగర్ నిండాలి, రెండు పంటలకు నీరు రావాలన్నారు.

సూర్యాపేట జిల్లా పోరాటాల ఖిల్లా అని సీఎం కేసీఆర్ కొనియాడారు. ఫ్లోరైడ్ ను రూపుమాపడం కోసం ఆనాడు యాత్రలు చేశానని, దుర్బర పరిస్థితిని చూసి కన్నీళ్లు పెట్టుకున్నామని గుర్తుచేశారు. ఆ స్థితిని మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.

నల్లగొండ జిల్లాలో ఎక్కడ చూసినా స్థూపాలే కనబడతాయని, అభివృద్ధి మాత్రం లేదని సీఎం కేసీఆర్ విమర్శించారు. ఇన్నాళ్లు పాలించిన లావు, పొడవు నాయకులు ఏం చేసిన్రని ప్రశ్నించారు. తాము రాజకీయాలకు అతీతంగా ప్రజా ప్రతినిధులు అందరికి నిధులు, అభివృద్ధి పనులు కేటాయిస్తున్నామని స్పష్టం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి  నియోజక వర్గంలో కూడా మిషన్ కాకతీయలో చెరువులను అభివృద్ధి చేస్తున్నామని, అది గుర్తించాలని హితవు పలికారు.