ప్రాజెక్టులకు జలకళ

భారీ వర్షాలకు రాష్ట్రంలోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకుంటున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు తోడు, రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వానలకు కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తుతోంది. జూరాల ప్రాజెక్టు వద్ద ప్రస్తుతం 1,09,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా…. 1,09,182 క్యూసెక్కుల ఔట్‌ ఫ్లో కొనసాగుతోంది. జూరాల వద్ద 12 గేట్లను ఎత్తేసిన అధికారులు స్పిల్ వే ద్వారా 65,627 క్యూసెక్కులు, పవర్ హౌస్ ద్వారా 42,000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కోయిల్ సాగర్‌కు మరో 315 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.  ప్రస్తుతం జూరాలలో 9.480 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎగవనున్న ఆల్మట్టిలో 128.19 టీఎంసీల నీటి నిల్వ ఉండటంతో ఇన్‌ ఫ్లో 36,582 క్యూసెక్కులు… ఔట్‌ ఫ్లో 48,796 క్యూసెక్కులు ఉంది.

ఇక శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం కూడా క్రమంగా పెరుగుతోంది. జూరాల నుంచి 1,07,525 క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి 17,917 క్యూసెక్కుల ఇన్ ఫ్లో శ్రీశైలంకు వచ్చి చేరుతున్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడుకు 12 వేల క్యూసెక్కులు, హంద్రీ-నీవాకు 2025 క్యూసెక్కులు, ఎంజీకేఎల్‌ఐ పథకానికి 8 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టు నీటిమట్టం 877.60 అడుగులకు చేరింది. ప్రాజెక్టు నీటి నిల్వ 176. 3314 టీఎంసీలుగా నమోదైంది.

మరోవైపు నల్గొండ జిల్లాలోని మూసీ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. సోమవారం మూసీ ప్రాజెక్టుకు 2వేల క్యూసెక్కుల ఇన్ ఫ్‌లో వచ్చింది. దీంతో ఒక గేట్‌ను రెండు అడుగుల మేర ఎత్తి 1300 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. మూసీ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు కాగా… ప్రస్తుతం 644 అడుగులకు చేరింది.