ప్రభుత్వ ఆస్పత్రుల్లో సకల సౌకర్యాలు

సీఎం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో సకల సౌకర్యాలను కల్పించామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి చెప్పారు. ప్రైవేట్ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను తీర్చిదిద్దామన్నారు. నల్లగొండలో 150 పడకల మాతా శిశు సంరక్షణ ఆసుపత్రిని, మరో 150 పడకల అదనపు భవనాలను మంత్రి జగదీష్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో వారు మాట్లాడారు.

ప్రభుత్వ ఆస్పత్రుల పని తీరు చాలా మెరుగుపడిందని మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. ప్రతి జిల్లా కేంద్రంలో, ఏరియా ఆసుపత్రుల్లో ఐసియు లను ఏర్పాటు చేశామని, సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో 65 పడకల ఐసియు ను ప్రారంభించామని వివరించారు. రాష్ట్రంలో 45 ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్ సెంటర్ లను ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. శిశు మరణాలు లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. ఆరోగ్యవంతమైన సమాజ స్థాపన కోసం సీఎం కేసీఆర్ కిట్ పథకాన్ని ప్రారంభించామన్నారు.

సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలతో నిరుపేదలకు నాణ్యమైన వైద్యం అందుతున్నదని మంత్రి జగదీశ్ రెడ్డి చెప్పారు. సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వ ఆస్పత్రులకు పోవాలంటేనే భయపడే పరిస్థితి తీసుకొచ్చారని, సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు విశ్వాసం పెంచారని వివరించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో డెలివరీలు చాలా పెరిగాయని, కేసీఆర్ కిట్ అద్భుతమైన ఫలితాలు ఇచ్చిందన్నారు. వైద్య సిబ్బందిని కూడా కావలసినంత మందిని నియమిస్తున్నామని తెలిపారు. ఉద్యమ సమయంలోనే సీఎం కేసీఆర్ ఒక్కో రంగంలో అభివృద్ధిపై ప్రణాళికలు రచించారని మంత్రి జగదీశ్ రెడ్డి గుర్తుచేశారు.

ఈ కార్యక్రమాల్లో నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.