పోలీస్ శాఖలో 23 ఏళ్ల సమస్యకు పరిష్కారం

ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న పోలీసు అధికారుల పదోన్నతి అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ పరిష్కరించారు. దాదాపు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా చర్చించి, న్యాయశాఖ అధికారులు, పోలీసు అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులతో అనేక దఫాలుగా చర్చలు జరిపి ఒకేసారి ఏకంగా 275 మందికి నాన్ క్యాడర్ ఎస్పీలుగా, ఎఎస్పీలుగా, డీఎస్పీలుగా పదోన్నతులు కల్పించాలని నిర్ణయించారు. దీంతో 1994 బ్యాచ్ వరకు ప్రతీ పోలీసు అధికారికి పదోన్నతి లభిస్తుంది. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి సంతకం చేశారు. పోలీసు అధికారుల పదోన్నతులపై హైదరాబాద్ లోని ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

పోలీసు పదోన్నతుల విషయంలో తమకు అన్యాయం జరుగుతున్నదని చాలా మంది ప్రభుత్వానికి ఫిర్యాదులు చేశారు. కొందరు కోర్టుకు పోయారు. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల దాకా పలువురికి వినతులు ఇచ్చారు. సమైక్య రాష్ట్రంలోనే పదోన్నతుల విషయంలో వివక్ష, గందరగోళం జరిగింది. ఈ సమస్యను పరిష్కరించి, పదోన్నతుల్లో పారదర్శకత పాటించాలని ముఖ్యమంత్రి దృఢ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పోలీసు అధికారుల పదోన్నతి అంశంపై విస్తృతంగా చర్చించారు. అడ్వకేట్ జనరల్ అభిప్రాయం కూడా తీసుకుని వివాదాలకు తావులేని విధంగా సమస్యను పరిష్కరించారు.

రాష్ట్ర వ్యాప్తంగా 139 మంది సీఐలకు డీఎస్పీలుగా, 103 మంది డీఎస్పీలకు ఎఎస్పీలుగా, 33 మంది ఎఎస్పీలకు నాన్ క్యాడర్ ఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. 1994 బ్యాచ్ వరకు ఉన్న పదోన్నతి కోసం వేచి చూస్తున్న సీఐలందరికీ పదోన్నతి లభించనుంది. పదోన్నతులు కల్పించిన వారితో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని, అవసరమనుకుంటే సూపర్ న్యూమరీ పోస్టులు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం ప్రకటించారు.

‘‘అర్హులైన వారందరికీ ఎలాంటి వివక్ష లేకుండా సకాలంలో పదోన్నతి లభించాలి. కానీ సమైక్య ఆంధ్రప్రదేశ్ లో అలాంటి న్యాయం జరగలేదు. వివక్ష చూపారు. దీనివల్ల కొంతమందికి అన్యాయం జరిగింది. జోన్ల వారీగా నియామకాలు జరిగినప్పటికీ రాష్ట్ర స్థాయి కేడర్ కు పదోన్నతి కల్పించే సందర్భంలో జోన్ల నిష్పత్తి పాటించాల్సిన అవసరం ఉంది. కానీ అలా జరగలేదు. గతంలో ఇన్ స్పెక్టర్ స్థాయి నుండి డీఎస్పీ స్థాయి వరకు ప్రమాషన్లు ఇచ్చినప్పుడు జరిగిన తప్పొప్పులను సరిదిద్ది, ఎవరికీ అన్యాయం జరుగకుండా చూడాలి.  అన్యాయాన్ని సరిదిద్దడానికి అవసరమైనచోట సూపర్ న్యూమరీ పోస్టులను ఏర్పాటు చేయాలి. ఇలా చేయటం వల్ల వరంగల్ జోన్ లో ఇన్ స్పెక్టర్లకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దవచ్చు’’ అని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.

ఈ సమావేశంలో ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి, మంత్రులు  పోచారం శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, ఈటెల రాజేందర్, ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, చీఫ్ సెక్రటరీ ఎస్పీ సింగ్, డీజీపీ అనురాగ్ శర్మ, అడ్వకేట్ జనరల్ ప్రకాశ్ రెడ్డి, న్యాయ శాఖ కార్యదర్శి నిరంజన్ రావు, సీఎంఒ అధికారులు నర్సింగ్ రావు, భూపాల్ రెడ్డి, హోం శాఖ కార్యదర్శి రాజీవ్ త్రివేది, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహెందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కొండా సురేఖ, విప్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ కొండా మురళి, ఎమ్మెల్యే అజయ్ కుమార్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారి తదితరులు పాల్గొన్నారు.

పోలీసు అధికారుల పదోన్నతుల్లో అన్యాయాలను సరిచేసి, అర్హులైన వారందరికీ ప్రమోషన్లు ఇచ్చినందుకు ఐదవ జోన్ కు చెందిన ప్రజా ప్రతినిధులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.