పోతిరెడ్డిపాడు గేట్లు మూసేయండి

పోతిరెడ్డిపాడు నుంచి కృష్ణా జలాలను సీమాంధ్రకు తరలించడాన్ని వెంటనే నిలిపివేయాలని ఏపీ సర్కారును కృష్ణా నదీ యాజమాన్య బోర్డు మంగళవారం ఆదేశించింది. పోతిరెడ్డిపాడు ద్వారా 5 టీఎంసీలకు అనుమతినిస్తే అందుకు భిన్నంగా మంగళవారం ఉదయం ఆరుగంటల సమయానికి 12.436 టీఎంసీలను తరలించుకుపోయారని ఏపీకి రాసిన లేఖలో బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ తెలిపారు. ఈ నేపథ్యంలో వెంటనే పోతిరెడ్డిపాడు గేట్లను మూసివేసి నీటి తరలింపును ఆపాలని స్పష్టంచేశారు.

అటు తెలంగాణ తీవ్రస్థాయిలో అభ్యంతరం వ్యక్తంచేస్తున్నా ఏపీ జలచౌర్యం కొనసాగుతున్నది. ఈ సంగతి ఆధారాలతో సహా బోర్డు దృష్టికి తెచ్చినా.. కృష్ణా బోర్డు అచేతనంగా వ్యవహరిస్తున్నది. ఈ పరిస్థితిని ఇంకా కొనసాగించరాదని మంత్రి హరీశ్‌రావు ఆదేశించడంతో ఈ విషయమై రాష్ట్ర నీటిపారుదలశాఖ ఈఎన్సీ మురళీధర్‌రావు కృష్ణాబోర్డుకు లేఖ రాశారు. ఏపీ అక్రమంగా నీటిని మళ్లిస్తున్న వైనాన్ని మరోసారి లేఖలో వివరించారు. గత నెల 27వ తేదీన బోర్డు తన లేఖ ద్వారా  ఏపీకి నీటి తరలింపును ఆపివేయాలని ఆదేశాలు కూడా ఇచ్చిందని ఈఎన్సీ లేఖలో గుర్తు చేశారు. అయినా కూడా ఏపీ సర్కారు బోర్డు ఆదేశాలను సైతం తుంగలో తొక్కుతూ ఇప్పటివరకు 12.40 టీఎంసీలను తరలించుకుపోయిందన్నారు. కాబట్టి వెంటనే గేట్లను మూసివేయించి, కృష్ణా బేసిన్‌లోని నాగార్జునసాగర్, కృష్ణా డెల్టా వాస్తవ తాగు, సాగునీటి అవసరాలను పరిరక్షించాలని సూచించారు.

తెలంగాణ ఈఎన్సీ మురళీధర్‌రావు లేఖతో పరిస్థితి తీవ్రతను గుర్తించిన కృష్ణా బోర్డు స్పందించక తప్పలేదు. వెంటనే నీటి మళ్లింపును ఆపాలని ఏపీకి ఆదేశాలు జారీ చేసింది. అటు పోతిరెడ్డిపాడు టెలిమెట్రీ ట్యాంపరింగ్‌పై తెలంగాణ చాలా సీరియస్‌గా ఉండటంతో కృష్ణా బోర్డు తర్జనభర్జన పడుతున్నది. బోర్డు చైర్మన్ శ్రీవాస్తవ దీనిపై విచారణకు ఆదేశించినా తెలంగాణ అంగీకరించలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మెకట్రానిక్స్ ఏజెన్సీపై చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది.

పోతిరెడ్డిపాడు ట్యాంపరింగ్ వివాదంతోపాటు కృష్ణాజలాల పంపిణీపై చర్చకు బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఈ మేరకు మంగళవారం బోర్డు సభ్య కార్యదర్శి రెండు రాష్ర్టాలకు లేఖ రాశారు. ఈ ఏడాదికి ఏ రాష్ర్టానికి ఎంతమేర నీటి అవసరాలున్నాయో వివరాలను ఈ నెల పదో తేదీలోపు ఇవ్వాల్సిందిగా ఆ లేఖలో కోరారు. పదో తేదీ వరకు రెండు రాష్ర్టాల నుంచి అభిప్రాయాలు వచ్చిన తర్వాత ఈ నెల 16-17 తేదీల్లోగానీ 23-24 తేదీల్లోగానీ సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నట్లు సమాచారం.