పేదింట కళ్యాణ కాంతులు నింపుతున్న కళ్యాణ లక్ష్మీ

కళ్యాణ లక్ష్మీ పథకం పేదల కళ్లలో కళ్యాణ కాంతులు నింపుతోంది. ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం కేసీఆర్.. 51 వేయి నుంచి 75 వేలకు పెంచారు. ఈ పథకాన్ని ఎస్పీ, ఎస్టీల తోపాటు పేద బీసీలకు వర్తించేలా సవరించారు. దీంతో లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది.పేదింట కళ్యాణ కాంతులు నింపుతున్న కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం పకడ్బందీగా అమలు చేస్తోంది. జిల్లా కేంద్రాల్లో స్వయంగా ప్రజా ప్రతితినిధులే లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ చేయాలనే ఆదేశాలతో.. మధ్యలో గండికొడుతున్న దళారులకు చెక్‌ పెట్టింది. నిజ‌మైన లబ్ధిదారుల‌కు నేరుగా డ‌బ్బులు చేరేలా చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. పెళ్లి కార్డు నుంచి మొద‌లుకుని.. ఫైల్ నెట్ లోఅప్ లోడ్ చేసి.. ప్ర‌భుత్వానికి చేరేదాకా ఎమ్మెల్యేలు ఫాలో అప్ చేస్తున్నారు.

ఒక్క ఖ‌మ్మం నియోజిక‌వ‌ర్గంలో వెయ్యి ఇర‌వై మందికి క‌ళ్యాణ‌ల‌క్ష్మీ, షాదీ ముబాక‌ర్ ద్వారా ల‌బ్ధి చేకూరడంపై ప్రజాప్రతినిధులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న ఈ పథకం.. పేదింటి ఆడ‌పిల్ల పెళ్లి పండుగ‌లా మార్చిందన్నారు. ప్ర‌భుత్వం పెద్ద మ‌న‌సుతో నిధుల కొర‌త లేకుండా చేస్తోంద‌ని చెప్పారు. తమ నియోజకవర్గం నుంచి వెయ్యి మంది లబ్ధిదారులను ఎంపిక చేసినందుకు సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కృతజ్ఞతలు తెలిపారు.  ఎస్సీ ఎస్టీ, మైనారిటీలతో పాటు పేద బీసీలను కూడా కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు వర్తించేలా చేయడంతో.. లబ్ధిదారుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రాబోయే రోజుల్లో మరింత మంది ఈ పథకం ద్వారా లబ్దిపొందనున్నారు.