పెరోల్ పై విడుదలైన శశికళ

తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలిత ఆప్తురాలైన శశికళ పెరోల్‌ పై జైలు నుంచి విడుదలయ్యారు. భర్త నటరాజన్‌ అనారోగ్యం దృష్ట్యా జైళ్ల శాఖ ఆమెకు ఐదు రోజుల ఎమర్జెన్సీ పెరోల్‌ ఇచ్చింది. కిడ్నీ, లివర్‌ ట్రాన్స్‌ ప్లాంటేషన్‌ జరిగిన భర్త బాగోగులు చూసుకునేందుకు 15 రోజుల పెరోల్‌ మంజూరు చేయాలంటూ శశికళ దరఖాస్తు చేసుకున్నారు. అయితే, దరఖాస్తు సంపూర్ణంగా లేదంటూ అక్టోబర్‌ 3న ఆమె పిటీషన్‌ ను జైళ్ల శాఖ తిరస్కరించింది. దీంతో ఆమె తరఫు న్యాయవాది అన్ని డాక్యుమెంట్లతో మరోసారి పెరోల్‌కు అప్లై చేశారు.

తాజాగా శశి అభ్యర్థనపై స్పందించిన అధికారులు ఆమెకు షరతులతో కూడిన ఎమర్జెన్సీ పెరోల్‌ మంజూరు చేశారు. తమిళనాడు రాజ్యసభ సభ్యుడు నవనీత్‌ కృష్ణన్‌ అండర్‌ టేకింగ్‌, వెయ్యి రూపాయల ష్యూరిటీపై శశికళ జైలు నుంచి బయటకు పంపేందుకు జైళ్ల శాఖ అనుమతించింది. ఆమె మేనల్లుడు టీటీవీ దినకరన్‌ పెరోల్‌కు సంబంధించిన ఫార్మాలిటీస్‌ పూర్తి చేసిన అనంతరం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు నుంచి శశి బయట అడుగుపెట్టారు. ఎనిమిది నెలల కారాగారవాసం అనంతరం పెరోల్‌పై బయటకు వచ్చిన శశికళకు ఆమె మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు. బెంగళూరు నుంచి ఆమె చెన్నై వెళ్లారు.

శశికళకు ఎమర్జెన్సీ పెరోల్‌ మంజూరు చేసిన జైళ్ల శాఖ అందుకు కొన్ని షరతులు విధించింది. ఈ ఐదు రోజుల్లో శశికళ చెన్నైలో ఎవరినీ కలవకూడదని, తన భర్త నటరాజన్‌ చికిత్స పొందుతున్న హాస్పిటల్‌, బంధువు ఇళవరసి ఇంటిలో మాత్రమే ఉండాలని అధికారులు నిబంధనలు విధించారు. రాజకీయ కార్యక్రమాలు, పబ్లిక్‌ మీటింగుల్లోనూ పాల్గొనవద్దని, ఎలక్ట్రానిక్‌, ప్రింట్‌ మీడియాకు ఎలాంటి ప్రకటనలు చేయొద్దని ఆదేశించారు.

అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన శశికళకు సుప్రీంకోర్టు నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 15 నుంచి ఆమె బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.