పిడుగు పాటు నుంచి ఎలా రక్షించుకోవాలి..?

వర్షాలు పడ్డప్పుడు మెరుపులు, పిడుగులు రావడం కామనే! కొంత మందికి మెరుపులంటే మహా సరదా! కానీ పిడుగులంటే మాత్రం అందరికీ హడలే! పిడుగులు పడ్డచోట అంతా భస్మమే. మెరుపులోంచి పుట్టుకొచ్చి మెరుపులాగే వెళ్లిపోతుంది పిడుగు. కానీ సెకన్ల వ్యవధిలోనే చేయాల్సిన నష్టం చేసి పోతాయి  ప్రపంచ వ్యాప్తంగా పిడుగుల వల్ల సంవత్సరానికి 24వేల మంది చనిపోతున్నారు. దాదాపు 2లక్షల మంది గాయపడుతున్నట్లు ఓ అంచనా.

మెరుపులు వచ్చి పిడుగులు పడ్డప్పుడు ఉష్టోగ్రత సుమారు 29వేల డిగ్రీలు ఉంటుంది. అంటే సూర్యుడి దగ్గర ఉండే ఉష్టోగ్రత కన్నా ఐదు రెట్లు ఎక్కువ. అంతే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సెకనుకు వందకు పైగా పిడుగులు పడుతున్నాయట. ఏవైనా రెండు మేఘాలు దగ్గరకు వచ్చినప్పుడు అందులోని పాజిటివ్‌, నెగెటివ్‌ కణాలు కలుసుకోవడం వల్ల మెరుపులు ఏర్పడతాయి. అయితే ఒక్కొక్క సారి మేఘాల అడుగు భాగంలో ఉన్న నెగెటివ్‌ కణాలు భూమిమీద ఉండే పాజిటివ్‌ కణాలను అట్రాక్ట్‌ చేసుకుంటాయి. అందుకోసం భూమి మీద ఎత్తైన ప్రదేశం అంటే చెట్లు కానీ, పర్వతాలు కానీ, మనుషులు కానీ ఏదైనా ఒక దాన్ని  ఎంచుకుంటాయి. వీటి ద్వారానే పాజిటివ్‌ నెగెటివ్‌ కణాల బాండింగ్‌ జరుగుతుంది. ఆ సమయంలో మెరుపు వచ్చి పిడుగులు పడుతుంటాయి.

పిడుగుల నుంచి పూర్తిగా రక్షించుకోవడం సాధ్యం కాకున్నా.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ప్రమాదం తగ్గిచుకోవచ్చు.  పిడుగులు పడుతున్న సమయంలో ల్యాండ్‌ ఫోన్‌లో అస్సలు మాట్లాడకూడదు. అలాగే టీవీలు చూడకూడదు, పిడుగులు పడే సమయంలో ట్యాప్‌ కింద స్నానం చేయకూడదు. ఇంటి కిటికీలు, తలపుల దగ్గర నిలబడకూడదు. వాటిని మూసే ఉంచాలి. ఒకవేళ బయటి ప్రదేశంలో ఉంటే వెంటనే ఒక షెల్టర్‌ను వెతుక్కోవాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో చెట్ల కింద నిలబడరాదు. ఒకవేళ మైదాన ప్రాంతాల్లో ఉంటే మోకాళ్ల మధ్య తల కిందకు వంచి  కూర్చోవాలి.

పిడుగు పడుతున్నప్పుడు కొన్ని సంకేతాలు కూడా వస్తాయి. వాటి ద్వారా పిడుగు పడుతుందని మనం అంచనా వేయొచ్చు. వర్షం పడుతున్న సమయంలో జుట్టు నిక్కబొడుచుకుంటుంటే పిడుగు పడే అవకాశం ఉందని అర్థం. అలాగే  చర్మం ఒకరకమైన జలదరింపుకు గురవుతున్నా.. దగ్గరలోని మెటల్‌ ఆబ్జెక్ట్‌  వైబ్రేట్‌ అవుతన్నా  పిడుగుపాటుకు సంకేతంగా గుర్తించాలి. వెంటనే దాన్నుంచి తప్పించుకోవడానికి సేఫ్ ప్లేస్ వెతుక్కోవాలి.