పార్కింగ్ పాలసీ ప్రకటించిన ప్రభుత్వం

హైదరాబాద్ నగరంతోపాటు రాష్ర్టంలోని ఇతర మున్సిపల్ కార్పోరేషన్లలో పార్కింగ్ సమస్యలను పరిష్కరించేందుకు ఉద్దేశించిన పార్కింగ్ పాలసీపైన మంత్రి కె.టి. రామారావు సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ బేగంపేటలోని క్యాంపు కార్యాలయంలో జీహెచ్ఎంసీ అధికారులు, మెట్రో రైలు ఎండి, నగర పోలీస్ కమిషనర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

పలుమార్లు వివిధ శాఖల భాగసామ్యంతో పార్కింగ్ పాలసీని తయారు చేసినట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ పాలసీ స్థూలంగా తెలంగాణలోని అన్ని మున్సిపల్ కార్పోరేషన్లను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్టు వివరించారు. ప్రస్తుతం రోజుకు సుమారు 700 కొత్త వాహనాలు హైదరాబాద్ రోడ్లపైకి వస్తున్నాయని, ఇంత వేగంగా రోడ్లపై వస్తున్న వాహనాలతో ఎదురయ్యే పార్కింగ్ సమస్యలకు పరిష్కారం చూపేందుకే ప్రత్యేకంగా పాలసీ తీసుకుని వస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం పలు రాష్ర్టాలు, దేశాల్లోని పాలసీలను అధ్యయనం చేసి అధికారులు పార్కింగ్ పాలసీని రూపొందించినట్టు వెల్లడించారు.

హైదరాబాద్ నగర పరిధిలోని మూడు పోలీస్ కమిషనరేట్లలోని అధిక సాంద్రత కలిగిన ప్రాంతాల్లో ముందుగా ప్రయోగాత్మకంగా ఈ పాలసీని అమలు చేయనున్నట్లు, ఇందుకోసం తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్ అధికారులను కోరారు. ఈ ఏడాది చివరి నాటికి పాలసీ అమలును ప్రారంభిస్తామన్నారు. స్థూలంగా పురపాలక శాఖ ప్రవేశపెట్టిన ఈ పార్కింగ్ పాలసీని రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో దశల వారీగా అమలు చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ పార్కింగ్ పాలసీ అమలుకై వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం వివిధ స్థాయిల్లో సమావేశాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ పార్కింగ్ పాలసీ అమలు ప్రారంభమయ్యేనాటికి ఎక్కడ పార్కింగ్ అందుబాటులో ఉందో తెలుసుకునేందుకు ప్రత్యేకంగా ఒక మొబైల్ యాప్ ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు.

పార్కింగ్ పాలసీలోని ముఖ్యాంశాలు:
పార్కింగ్ పాలసీ ప్రకారం ఆన్ స్ర్టీట్ పార్కింగ్, షార్ట్ స్టే పార్కింగ్, నివాస భవనాల్లోని పార్కింగ్, ప్రభుత్వ కార్యాలయాలు/ బహిరంగ ప్రదేశాల్లో పార్కింగ్, భారీ వాహనాల పార్కింగ్, బస్సు, రైల్వే స్టేషన్లు, ఎంఎంటిఎస్ స్టేషన్లలో పార్కింగ్, ఖాళీ స్థలాలు (ఓపెన్ ప్లాట్ల పార్కింగ్) అనే వివిధ కేటగిరీలకు ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించారు.

ఆన్ స్ట్రీట్ కేటగిరీలో భాగంగా విశాలమైన రోడ్లు ఉన్నచోట అంటే.. కనీసం 12 మీటర్ల కన్నా ఎక్కువ వెడల్పు ఉన్న రోడ్లపైన పార్కింగ్ కు అనుమతి ఇస్తారు. కేవలం కొద్దిసేపటి కోసం పార్కింగ్ చేసుకునే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. ముఖ్యంగా బ్యాంకులు, దుకాణాలు వంటి చోట్ల ఈ పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం దుకాణదారులే తమ వాహనాలను తమ ముందు రోడ్లపై రోజంతా పెట్టే పద్ధతికి ఈ నిబంధన చరమగీతం పాడుతుంది. ఇలాంటి చోట్ల పార్కింగ్ గడువుపైన పరిమితులు విధించడం, పార్కింగ్ ఫీజు విధించడం వల్ల ఈ పద్ధతి కొనసాగేందుకు అవకాశం ఉండదు.

ఇక భవన సముదాయాల నిర్మాణం కోసం రూపొందించిన నిబంధనల్లో పొందుపర్చిన పార్కింగ్ సంబంధిత నిబంధనలను మరింత కఠినంగా అమలు చేయనున్నారు. కొత్తగా నిర్మించబోయే భవనాల్లో బహిరంగ పార్కింగ్ కోసం నిర్మించే ఫ్లోర్లకు ఆస్తి పన్ను మినహాయింపు ఇవ్వనున్నారు. ఇలాంటి సందర్భాల్లో భవన నిర్మాణాల నిబంధనల్లో మినహాయింపు, ఆస్తి పన్ను వంటి ప్రోత్సహకాలను ప్రకటించనున్నారు.

డిమాండ్ కు అనుగుణంగా పార్కింగ్ ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యతను ఆయా సంస్థలపైనే ఉంచేలా ఈ పాలసీలో నిబంధనలు రూపొందించారు. రోడ్లపైన భారీ వాహనాలను పార్కింగ్ చేసే పద్ధతికి స్వస్తి పలికి, భారీ వాహనాలను ప్రత్యేకమైన ప్రాంతాల్లో మాత్రమే నిలిపేలా చర్యలు తీసుకోనున్నారు.

ప్రైవేట్ భాగస్వామ్యంలో పార్కింగ్ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చేలా ఈ పాలసీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. మల్టీ లెవెల్ పార్కింగ్ సౌకర్యాలను, పిపిపి లేదా ఇతర ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్య పద్ధతుల్లో అభివృద్ధి పరిచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోనున్నారు. పార్కింగ్ కు అనుకూలంగా ఉన్న, ప్రైవేట్ వ్యక్తుల ఖాళీ ప్లాట్లలో పార్కింగ్ కు అనుమతి ఇచ్చేందుకు, ప్రత్యేకంగా లైసెన్స్ విధానాన్ని రూపొందించనున్నారు. ఖాళీ స్థలాలను పార్కింగ్ కోసం కేటాయించే వారికి ఆస్తి పన్ను వంద శాతం మినహాయింపు ఇవ్వనున్నారు.

యునిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్ పోర్ట్ అథారిటీ (యుఎంటిఎ) ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ, మెట్రో రైల్ సంస్థ, నగర పోలీస్ మరియు ట్రాఫిక్ కమిషనరేట్లు కలిసి పనిచేస్తాయి. పార్కింగ్ పాలసీ అమలు కోసం ఏర్పాటుచేసే పార్కింగ్ కమిటీ ఈ మొత్తం వ్యవహారాన్ని పర్యవేక్షిస్తుంది. పాలసీ అమలుకు అవసరమైన నిధులు, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి తీసుకోవాల్సిన ప్రత్యేక కార్యక్రమాలు, ఫీజుల నియంత్రణ వంటి అంశాలను ఈ పార్కింగ్ కమిటీ చేపడుతుంది.