పాత పద్ధతిలోనే డీఎస్సీ

డీఎస్సీ 2017ను పాత పద్ధతిలోనే నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. కొత్త సిలబస్, కొత్త ప్యాటర్న్ జోలికి వెళ్లకుండా డీఎస్సీ పరీక్ష విధానంలోనే టీఆర్టీ నిర్వహించాలని నిర్ణయించారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి ఆధ్వర్యంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.  పూర్తి కసరత్తు తర్వాత దీనికి సంబంధించిన ప్రకటన వెలువడనుంది.  అలాగే, భర్తీ ప్రక్రియలో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై కూడా చర్చించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోను, పాఠశాల విద్యాశాఖ అందించిన వివరాలను సమగ్రంగా అధ్యయనం చేయాలని కమిషన్ నిర్ణయించింది. సాంకేతిక అంశాలు సమగ్రంగా అధ్యయనం చేసి, న్యాయపరమైన సమస్యలు రాకుండా నోటిఫికేషన్ జారీచేయాలని సమావేశం నిర్ణయించింది.

ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ వెలువడే సమయం నుంచి ఎంపిక ప్రక్రియ పూర్తయ్యేవరకు పూర్తి సమన్వయంతో వ్యవహరించాలని టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి కమిషన్ సభ్యులకు సూచించారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్‌ సహాయంతో.. ప్రతిరోజూ జిల్లాల వారీగా సమాచారం తెప్పించుకోవాలని చెప్పారు. టీఆర్టీ-2017కు దాదాపు 5 లక్షల మంది దరఖాస్తు చేసే అవకాశం ఉన్నందున 31 కేంద్రాల్లో అందుకు తగ్గట్టుగా పరీక్షా ఏర్పాట్లు ఉండాలని వివరించారు.