పర్యాటక శాఖ పాత్ర చాలా గొప్పది!

తెలంగాణ చరిత్ర, ఇక్కడి పర్యాటక ప్రాంతాల గొప్పతనాన్ని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ప్రపంచానికి చాటి చెబుతోందని శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ ప్రశంసించారు. హైదరాబాద్ తారామతి బారాదరిలో రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ ఏర్పాటు చేసిన వరల్డ్ టూరిజం డే, పర్యటన్ పర్వ్ సెలబ్రేషన్స్ ను ఆయన ప్రారంభించారు.

మన చరిత్ర చాలా ఘనమైనదని, దాన్ని ప్రపంచానికి చాటి చెప్పడంలో టూరిజం శాఖ పాత్ర గొప్పదని స్వామిగౌడ్ అన్నారు. రాష్ట్రానికి వచ్చే పర్యాటకులకు ఇక్కడ ఆతిథ్య రంగాల్లో సేవలు అందిస్తున్న వారి కృషిని ఆయన అభినందించారు. మన విద్యార్థులకు మన ప్రాంతాల గురించి చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. మన సంస్కృతి, సంప్రదాయం, పర్యాటక ప్రాంతాల గొప్పతనం మన విద్యార్థులకు తెలియాలన్నారు. మరింత ఉత్సాహంతో పని చేసి రాష్ట్రానికి గొప్ప పేరు తీసుకురావాలని సూచించారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రమైనా రికార్డ్ స్థాయిలో ఎనిమిది నేషనల్ టూరిజం అవార్డులు తెలంగాణ సాధించిడం గొప్ప విషయమని స్వామిగౌడ్ ప్రశంసించారు.

టూరిజం అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దఎత్తున నిధులు కేటాయిస్తున్నారని, రాష్ట్రంలో టూరిజం అభివృద్ధి చెందుతుందని పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పేర్వారం రాములు అన్నారు. సీఎం కేసీఆర్ సలహాలు, సూచనలతో టూరిజం శాఖ ముందుకు వెళ్తోందన్నారు.

తెలంగాణ స్టేట్ టూరిజం అవార్డ్స్ పేరుతో వివిధ విభాగాల్లో పురస్కారాలు ఇవ్వనున్నట్టు టూరిజం శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడించారు.