పరిటాల శ్రీరాం పెళ్లికి హాజరైన సీఎం కేసీఆర్

ఏపీ మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్‌ వివాహ వేడుక అనంతపురం జిల్లాలోని వారి స్వగ్రామం వెంకటాపురంలో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ హాజరయ్యారు. హైదరాబాద్ లోని బేగంపేట ఎయిర్‌ పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్‌ పుట్టపర్తి చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌ లో వెంకటాపురం చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌ కు ఏపీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు, పరిటాల సునీత బంధువులు, ఇతర ప్రముఖులు ఘనస్వాగతం పలికారు. హెలిప్యాడ్ నుంచి వివాహ వేదిక వరకు బస్సులో వెళ్తున్న సీఎం కేసీఆర్ కు దారి పొడవునా వేలాది మంది అభివాదం చేశారు.

నూతన వధూవరులు శ్రీరాం, జ్ఞానలను సీఎం కేసీఆర్‌ ఆశీర్వదించారు. పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామ్ ని ఆలింగనం చేసుకొని హృదయపూర్వకంగా అభినందించారు. పరిటాల శ్రీరామ్ తల్లి, ఏపీ మంత్రి పరిటాల సునీతను అప్యాయంగా పలకరించారు. సీఎం కేసీఆర్ తో పాటు మంత్రి తుమ్మల నాగేశ్వర్‌ రావు, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌ రావు, టీ న్యూస్‌ ఎండీ సంతోష్‌ కుమార్‌ ఉన్నారు. అనంతరం పరిటాల రవి సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు.

సీఎం కేసీఆర్‌ రాకతో వివాహ వేదిక మొత్తం జై కేసీఆర్‌ నినాదాలతో హోరెత్తిపోయింది. సీఎం కేసీఆర్‌ వారికి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. దాంతో పెండ్లికి వచ్చిన వారంతా గట్టి కేకలు వేస్తూ చప్పట్లతో సీఎం కేసీఆర్‌ పై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం మంత్రి పరిటాల సునీత సీఎం కేసీఆర్‌ కు దగ్గరుండి వీడ్కోలు పలికారు.