పత్తి కొనుగోళ్లు, స్వయం ఉపాధిపై కడియం సమీక్ష

ఉమ్మడి వరంగల్ జిల్లాలో స్వయం ఉపాధి పథకాల అమలు, పత్తి కొనుగోళ్లపై వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టరేట్ లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమీక్ష జరిపారు. పత్తి అమ్మకాలపై రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. పత్తిని మార్కెట్ కు తరలించే సమయంలో తేమ లేకుండా చూడాలని రైతులకు సూచించారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలో 3 లక్షల 7వేల హెక్టార్లలో పత్తి సాగు చేశారని కడియం చెప్పారు. 6 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. సీసీఐ 18 కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేస్తుందని, దీనితో రైతులకు మద్దతు ధర లభిస్తుందని అన్నారు. పత్తి కొనుగోళ్లకు ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా అధికారులను నియమిస్తున్నామని కడియం వెల్లడించారు. కలెక్టర్లు పత్తి కొనుగోళ్లను పర్యవేక్షిస్తారని, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. రైతుల రద్దీకి అనుగుణంగా మార్కెట్లలో సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. సెలవుల తర్వాత వచ్చే సరకు రద్దీని అంచనా వేసి అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. రైతులకు అక్షయపాత్ర భోజన సదుపాయాలు సరిగ్గా అందాలని సూచించారు.

2016-18 సంవత్సరాల్లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ స్వయం ఉపాధి కల్పన పథకాలు గ్రేటర్ వరంగల్ లో లబ్ధిదారుల ఎంపిక జరగలేదని డిప్యూటీ సీఎం తెలిపారు. సత్వరం లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆదేశించామని చెప్పారు. వెండింగ్ జోన్ లలో చిరు వ్యాపారులకు అందించే ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించామన్నారు.

పాలన ప్రజల ముందుకు తీసుకెళ్లేందుకు సీఎం కేసీఆర్ 31 జిల్లాలను ఏర్పాటు చేశారని, రేపు ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయాలకు శంకుస్థాపన చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని కడియం శ్రీహరి వెల్లడించారు.

ఈ సమావేశంలో గ్రేటర్ వరంగల్ మేయర్ నరేందర్, పశ్చిమ ఎమ్మెల్యే వినయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.