నోబెల్ రేసులో ఆర్‌.బి.ఐ మాజీ గవర్నర్ రఘరాం రాజన్‌

ఆర్‌.బి.ఐ మాజీ గవర్నర్‌ రఘురాం రాజన్‌ ప్రతిష్టాత్మక అవార్డుకు అడుగు దూరంలో ఉన్నారు. ప్రఖ్యాత నోబెల్ బహుమతి కోసం ఆయన పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. క్లారివేట్‌ ఎనలిటిక్స్‌ అనే సంస్థ ఈ విషయాన్ని బయటపెట్టింది. రాజన్‌ తో పాటు మరో ఐదుగురు ఆర్థిక వేత్తలు ఈ అవార్డు కోసం పోటీ పడుతున్నారు. ఐతే సోమవారం నోబెల్ కమిటీ ఈ అవార్డు ను ప్రకటించనుంది. దీంతో ఎవరు ఈ అవార్డు గెలుచుకుంటారా ఆసక్తి మొదలైంది.

భారత్ నుంచి ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ అవార్డును ఇద్దరు మాత్రమే దక్కించుకున్నారు. వారిలో ఒకరు అమర్త్యసేన్‌ కాగా మరొకరు మేఘనాథ్‌ దేశాయి. మేఘనాథ్‌ దేశాయ్‌ భారత సంతతికి చెందిన వారైనప్పటికీ యూనైటెడ్‌ కింగ్‌ డమ్‌ లో ఆర్థిక వేత్తగా పనిచేశారు.ఇక ఆర్థిక శాస్త్రంలో రఘురాం రాజన్‌ కు విశేష అనుభవం ఉంది. 2008లో ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థిక సంక్షోభం గురించి రాజన్‌ ముందే హెచ్చరించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌ గానూ ఎన్నో సంస్కరణలు చేపట్టారు. ప్రధాని నరేంద్రమోడీ నోట్ల రద్దు నిర్ణయాన్ని కూడా ఆయన వ్యతిరేకించారు.

ప్రస్తుతం యూనివర్సిటీ ఆఫ్‌ చికాగోకు చెందిన బూత్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో ఎకానమిక్స్ ప్రొఫెసర్‌ గా పనిచేస్తున్నారు రాజన్‌. ఇటీవలే ‘ఐ డు వాట్‌ ఐ డు’ పేరుతో ఆర్‌బిఐ గవర్నర్‌గా తన అనుభవాలను పుస్తక రూపంలో తీసుకొచ్చారు. ఢిల్లీ ఐఐటి నుంచి గ్రాడ్యుయేట్‌ పట్టా పుచ్చుకున్న రాజన్‌ అనేక అంతర్జాతీయ విద్యా సంస్థలకు విజిటింగ్‌ ప్రొఫెసర్‌గా ఉన్నారు. 2013 నాటి రూపాయి సంక్షోభాన్ని పరిష్కరించడంలో రాజన్‌ చూపిన తన ప్రతిభ చూపారు. ఇందుకు గానూ బ్రిటన్‌కు చెందిన సెంట్రల్‌ బ్యాంకింగ్‌ పత్రిక సెంట్రల్‌ బ్యాంకర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుకు ఎంపిక చేసింది