నిజామాబాద్ లో ఐటి టవర్స్

నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం పరిధిలోని కార్పొరేషన్ల అభివృద్ధికి సీఎం కేసీఆర్ రూ.350 కోట్లు మంజూరు చేశారని ఎంపీ కవిత వెల్లడించారు. నిజామాబాద్ లో ఐటి టవర్స్ నిర్మాణానికి కూడా రూ.50 కోట్లు మంజూరు చేశారని చెప్పారు. వచ్చే దసరాకు అన్ని హంగులతో దీన్ని ప్రారంభిస్తామన్నారు. ఈ మేరకు హైదరాబాద్ లోని రాష్ట్ర సచివాలయంలో మున్సిపల్, ఐటి శాఖల మంత్రి కేటీఆర్ తమకు ఉత్తర్వుల కాపీలు ఇచ్చారని తెలిపారు. నిజామాబాద్ జిల్లా ప్రజా ప్రతినిధులతో పాటు మంత్రి కేటీఆర్ ను కలిసిన తర్వాత ఎంపీ కవిత సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.

నిజామాబాద్ జిల్లా పర్యటనలో ఇచ్చిన హామీల అమలుకు ఇవాళ ఉత్తర్వులు ఇచ్చారని ఎంపీ కవిత చెప్పారు. నిధులు కేటాయించినందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కు కవిత ధన్యవాదాలు తెలిపారు. జిల్లాల్లో కూడా ఐటి కంపెనీలు ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన విధంగానే  మొదటిది ఖమ్మంలో ఏర్పాటు చేసిందని కవిత చెప్పారు. ఇప్పుడు నిజామాబాద్ లో ఏర్పాటు చేస్తోందని తెలిపారు. నిజామాబాద్ లో మంచి ఇంక్యుబేటర్ ఏర్పాటు చేస్తామన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్త కృషితో మరిన్ని నిధులు సమకూర్చిన మంత్రి కేటీఆర్ కు ధన్యవాదాలు చెప్పారు. రాబోయే రోజుల్లో జిల్లాల్లో మరిన్ని ఐటి పార్క్ లు ఏర్పాటు చేస్తామన్నారు. ఐటి టవర్స్ వల్ల గ్రామీణ విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.

పసుపు బోర్డ్ ఏర్పాటు కేంద్రం పరిధిలో ఉందని, తాను ప్రతిసారి కేంద్రాన్ని అడుగుతూనే ఉన్నానని ఎంపీ కవిత చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం చెప్పింది చేసి చూపించే ప్రభుత్వమని అన్నారు.