నిండుకుండల్లా జలాశయాలు

రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ నిండుకుండలను తలపిస్తున్నాయి. భారీ వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా ఇన్  ఫ్లో ఉండడంతో రెండు గేట్లు ఎత్తారు. దాంతోపాటు జూరాల, మూసి, ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లను కూడా ఎత్తారు.

బిరబిరా కృష్ణమ్మ నాగార్జున సాగర్ వైపు తరలివెళ్తోంది. ఏడేండ్ల తర్వాత శ్రీశైలం రిజర్వాయర్ పూర్తిస్థాయిలో నిండింది. 2009లో వచ్చిన వరదల తర్వాత ఈసారి పూర్తి స్థాయిలో శ్రీశైలం నిండటంతో రెండు గేట్లను ఎత్తి నాగార్జునసాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. ఇప్పటి వరకు పవర్ జనరేషన్ తో సాగర్ కు నీటి విడుదల చేస్తుండగా.. మూడేండ్ల తర్వాత శ్రీశైలం గేట్లు తెరిచారు. అయితే ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండిన తర్వాత గేట్ల ఎత్తడం ఇది మూడోసారి. శ్రీశైలం గేట్ల నుంచి 55 వేల క్యూసెక్కులు, పవర్ హౌజ్ నుంచి 75 వేల క్యూసెక్కులు దిగువన ఉన్న నాగార్జునసాగర్  వైపు  తరలివెళ్తున్నాయి.

శ్రీశైలం నుంచి మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1600 క్యూసెక్కులు, హంద్రీ-నీవాకు 338 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడుకు 11వేల క్యూసెక్కుల చొప్పన నీటి విడుదల కొనసాగుతున్నది. రెండు పవర్ హస్ లలో మొత్తం 1628 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుండగా దీనికోసం 31,795 క్యూసెక్కుల నీటిని ఔట్ ఫ్లో ద్వారా బయటకు వదులుతున్నారు. జూరాల నుంచి 68,235 క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి 45,324, హంద్రీ నది నుంచి 3,750 క్యూసెక్కుల చొప్పన మొత్తం 1,17,309 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదవుతున్నది. ఇక ప్రస్తుతం నాగార్జునసాగర్లో 530.80 అడుగుల నీటిమట్టం కొనసాగుతున్నది. 169.7124 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. ఇన్ ఫ్లో 1,30,007 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1,350 క్యూసెక్కులుగా ఉన్నది. ఒక్కరోజులోనే సుమారు 10 టీఎంసీల నీటినిల్వ పెరిగింది.

జూరాలకు ఎగువ నుంచి 66,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. 7 గేట్లను ఎత్తి 14,438 క్యూసెక్కులను స్పిల్‌వే ద్వారా విడుదల చేస్తున్నారు. జలాశయంలో 9.234 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. ఎగువనున్న ఆల్మట్టిలో 128.19టీఎంసీల నీటినిల్వ ఉండటంతో ఇన్‌ఫ్లో 24,038 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 24,038 క్యూసెక్కులు ఉంది. నారాయణపూర్‌లో 37.22 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలంలోని మూసీ ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల నుంచి 3,400 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. దీంతో 3 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి 4,200 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. పెద్దపల్లి జిల్లా ఎల్లంపల్లిలోని శ్రీపాద ప్రాజెక్టులోకి భారీగా నీరు చేరి నిండుకుండను తలపిస్తున్నది. 3728 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. దీంతో మూడు గేట్లను ఎత్తి 7వేల క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి వదులుతున్నట్టు అధికారులు తెలిపారు.

శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌ కు 22,200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతున్నది. కాకతీయ నుంచి 50 క్యూసెక్కులు, లక్ష్మీకాలువ నుంచి 200 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు, 90టీఎంసీలు కాగా.. 1075.70 అడుగులు, 41.452 టీఎంసీల నీటి నిల్వ ఉంది.  నిజాంసాగర్‌లోకి 2557 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.031 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కడెం జలాశయంలోకి ఎగువ నుంచి 840 క్యూసెక్కుల వరద వస్తున్నది. కేవలం కుడి కాలువ ద్వారా 17 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. మొత్తానికి రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకుంటున్నాయి. దీంతో, రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.