నిండుకుండలా ప్రాజెక్టులు

రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకున్నాయి. జూరాల ప్రాజెక్టు వద్ద ప్రస్తుతం 67 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా… 73 వేల క్యూసెక్కుల ఔట్‌ ఫ్లో కొనసాగుతోంది. జూరాల వద్ద 4 గేట్లలో రెండింటిని ఒక మీటరు, రెండింటిని 0.5 మీటరు మేర ఎత్తి నీటిని దిగువకు వదిలారు. స్పిల్ వే ద్వారా 29,160 క్యూసెక్కులు, పవర్ హౌస్ ద్వారా 42,000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కోయిల్ సాగర్‌కు మరో 315 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 9.377 టీఎంసీల నీటి నిల్వ ఉన్నది. ఎగవనున్న ఆల్మట్టిలో 129.72 టీఎంసీల నీటి నిల్వ ఉండటంతో ఇన్‌ ఫ్లో 35,080 క్యూసెక్కులు… ఔట్‌ ఫ్లో 35,080 క్యూసెక్కులు ఉంది. నారాయణపూర్‌లో 37.43 టీఎంసీల నీటి నిల్వ ఉండటంతో ఇన్‌ఫ్లో 41,183 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 39.946 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి వరద కొనసాగుతున్నది. జూరాల నుంచి 56,444 క్యూసెక్కులు, తుంగభద్ర నుంచి 4,449 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతున్నది. ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డిపాడుకు 10 వేల క్యూసెక్కులు, హంద్రీ-నీవాకు 2025 క్యూసెక్కులు, ఎంజీకేఎల్‌ఐ పథకానికి 1600 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు.. 215.80 టీఎంసీలకు గానూ ..  880.60 అడుగులు.. 191.211 టీఎంసీలకు  నీరుంది. ప్రాజెక్టు నుంచి 21,041 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదైంది. ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో 150 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తు.. నాగార్జునసాగర్‌కు 7,416 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.  నాగార్జునా సాగర్‌ ప్రాజెక్టులో ప్రస్తుతం 517 అడుగులతో 144.936 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.సింగూరు ప్రాజెక్టులోకి 985 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 29.91 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 29.05 టీఎంసీల నీరున్నది. దీంతో..  నీటిని కిందికి వదిలి జెన్‌కో ద్వారా 15 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభించారు. మొత్తం 4,827 క్యూసెక్కులు ఔట్‌ఫ్లో కొనసాగుతున్నది. హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాకలకు నల్లగొండ జిల్లాలో మూసీ ఉధృతంగా ప్రవహిస్తోంది. 14 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. గత మూడు రోజులతో పోల్చుకుంటే ఇన్‌ఫ్లో భారీగా పెరుగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటమట్టం 645 అడుగులు కాగా.. ప్రస్తుతం 644 అడుగుల వద్ద నీటిమట్టం కొనసాగుతోంది. ఎగువ నుంచి ఇన్‌ఫ్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున అప్రమత్తమైన అధికారులు ప్రాజెక్టు 2, 3, 4, 7, 8, 10వ గేట్లను 3 అడుగుల మేర ఎత్తి 12 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోని అన్ని జలాశయాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. పులిచింతల, తుంగభద్ర, కడెం, జైక్వాడ్,ఎస్సారెస్పీ, నిజాం సాగర్, ఎల్లంపల్లి, లోయార్ మానేరు, ధవలేశ్వరం జలాశయాల్లో దాదాపు పూర్త ఇస్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి.