నల్గొండకు కాంగ్రెస్ అన్యాయం ఈనాటిది కాదు!

లక్ష మంది ఉత్తమ్ కుమార్ రెడ్లు అడ్డుపడ్డా కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి తీరుతామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. సూర్యాపేటలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం, జిల్లా పోలీస్ కార్యాలయాలకు శంకుస్థాపన చేసిన తర్వాత పలు అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా సూర్యాపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రగతి సభలో ఆయన మాట్లాడారు.

పెద్ద దేవులపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సామర్థ్యం 0.8 టిఎంసీల నుంచి పెంచుతామని, దాని నుంచి 3 లక్షల 20 వేల ఎకరాలకు రెండు పంటలకు నీళ్లిస్తామన్నారు సీఎం కేసీఆర్. యాదాద్రి భువనగిరి జిల్లాలో గంధమల్ల, బస్వాపూర్ రిజర్వాయర్లతో నీటి కరువు తీరుతుందన్నారు. మూసి ప్రాజెక్టు 365 రోజులు నీళ్లతో నిండి ఉంటుందని చెప్పారు. 10 లక్షల ఎకరాలకు నీరిచ్చే సీతారామ ప్రాజెక్ట్ ద్వారా ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతుందని, దేశంలోనే నంబర్ వన్ ధనిక జిల్లా అవుతుందని అన్నారు.

ప్రాజెక్టులకు అడ్డుపడుతున్న కాంగ్రెస్ నాయకులపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నాగార్జున సాగర్ నాటి నుంచి తెలంగాణకు, నల్గొండ జిల్లాకు కాంగ్రెస్ నాయకులు చేసిన అన్యాయాన్ని బట్టబయలు చేశారు. నాగార్జున సాగర్ అసలు పేరు నందికొండ అని, దాన్ని ఇప్పుడున్న ప్రదేశంలో కాకుండా 19 కిలోమీటర్ల పైన ఏలేశ్వరం దగ్గర కట్టాల్సి ఉండెనన్నారు. అదే జరిగి ఉంటే పాత నల్గొండ జిల్లాలో 10 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవన్నారు. నందికొండను నాగార్జున సాగర్ గా మారుస్తున్నా, కిందికి కట్టి నీళ్లు రాకుండా చేస్తున్నా తెలంగాణకు చెందిన అప్పటి సీఎం నుంచి నిన్నమొన్నటి కాంగ్రెస్ పాలకుల వరకు ఎవరూ మాట్లాడలేదని మండిపడ్డారు. సాగర్ నుంచి తెలంగాణకు రావాల్సిన నీటి వాటా ఏపీకి, ఏపీకి ఇవ్వాల్సిన నీటి వాటా తెలంగాణకు మార్చినా వాళ్లు మాట్లాడలేదన్నారు.

ఏపీకి నీళ్లు తీసుకెళ్లే సాగర్ కుడికాలువ లిఫ్టుల కరెంట్ బిల్లులు, నిర్వహణ ఖర్చులు ప్రభుత్వం కడితే, తెలంగాణకు వచ్చే ఎడమ కాలువ నిర్వహణ ఖర్చులు రైతులు భరించాల్సి వచ్చేదని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. ఇదేం అన్యాయమని తాను నిలదీసిన తర్వాతనే వాటిని ప్రభుత్వం చెల్లించందన్నారు. అప్పుడు ఈ నాయకులు ఎందుకు మాట్లాడలేదని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు.

గత కాంగ్రెస్ పాలకులు దక్షిణ తెలంగాణకు అన్యాయం చేస్తుంటే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నోరు మూసుకున్నారని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. పులిచింతల ప్రాజెక్ట్ విషయంలో కాంగ్రెస్ నేతలు డ్రామాలు ఆడారని, నిర్వాసితులకు ఉత్తమ్ కుమార్ రెడ్డి నష్టపరిహారం కూడా ఇప్పించలేదన్నారు. ఉత్తమ్ ఇకనైనా డ్రామాలు ఆపాలని అన్నారు.

తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఆనాడు వైయస్ అడుగులకు మడుగులు ఒత్తి పులిచింతల కట్టించారని, తెలంగాణను ముంచి ఏపీకి నీళ్లు తీసుకెళ్తున్నారని విమర్శించారు. పోతిరెడ్డిపాడుకు నీళ్లు తీసుకుపోతుంటే హారతులు పట్టారని, నోరు మూసుకున్నారని మండిపడ్డారు.
తనను నడిపించింది ప్రజలేనని, వాళ్ళ కోసం రక్తం రంగరించి సేవ చేస్తానని అన్నారు.