నంబర్ వన్ గా ముఖేష్ స్థానం ‘పది’లం

రిలయన్స్ దిగ్గజం ముఖేష్‌ అంబానీ మరోసారి రిచెస్ట్ మ్యాన్ గా నిలిచారు. భారత్‌ లో అత్యంత సంపద కలిగిన వ్యక్తిగా తన స్థానాన్ని పదిల పరుచుకున్నారు. 2017 సంవత్సరానికి గాను ఫోర్బ్స్ ఇండియా మ్యాగజైన్‌ విడుదల చేసిన టాప్ 100 రిచెస్ట్ జాబితాలో ముఖేష్ నంబర్‌ వన్‌ గా ఉన్నారు. ఆయన మొత్తం సంపద దాదాపు 2 లక్షల 30 వేల కోట్ల రూపాయలుగా ఉంది. పదేళ్లుగా ఈ జాబితాలో ఆయనే నంబర్‌ వన్‌ గా ఉంటున్నారు. గతేడాది జియోతో టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన ముఖేశ్‌… ఈ ఏడాది తన సంపద ఏకంగా లక్ష కోట్ల రూపాయల వరకు పెంచుకోగలిగారు. అంతేకాకుండా ఆసియాలో అత్యంత ధనవంతుల జాబితాలో మొదటి ఐదుగురిలో ఉన్నారు ముఖేష్‌ అంబానీ.

ముఖేష్ తర్వాత రెండో స్థానంలో నిలిచారు విప్రో ఛైర్మన్ అజిమ్‌ ప్రేమ్‌జీ. ఐతే ముఖేష్‌ అంబానీ సంపదలో ప్రేమ్ జీ సంపద సగం మాత్రమే. ఆయన మొత్తం ఆస్తి విలువ లక్షా 14 వేల కోట్ల రూపాయలకు పైగా ఉంది. మూడో స్థానంలో హిందుజా బ్రదర్స్ నిలిచారు. వీరి మొత్తం సంపద లక్షా 12 వేల కోట్ల రూపాయలుగా ఉంది. ఉక్కు దిగ్గజం లక్ష్మీ నివాస్‌ మిట్టల్ మరోసారి టాప్‌ టెన్‌ లో చోటు దక్కించుకున్నారు. దాదాపు లక్ష కోట్ల రూపాయల సంపదతో నాలుగో స్థానంలో నిలిచారు.

షాపూర్‌ జీ పల్లోంజి 5 వ స్థానం దక్కించుకున్నారు. వీరి సంపద 96 వేల కోట్ల రూపాయల వరకు ఉంది. గోద్రెజ్‌ ఫ్యామిలీ ఆరో స్థానంలో నిలిచింది. 86 వేల కోట్ల రూపాయల సంపద ఈ ఫ్యామిలీకి ఉన్నట్లు ఫోర్బ్స్ ప్రకటించింది. హెచ్‌.సి.ఎల్ అధినేత శివనాడార్‌ 79 వేల కోట్ల రూపాయలతో ఏడో స్థానంలో ఉండగా… బిర్లా గ్రూప్‌ అధినేత కుమార మంగళం బిర్లా 75 వేల కోట్ల రూపాయల సంపదతో 8 వ స్థానంలో నిలిచారు. ఫార్మా అధినేత దిలిప్‌ సంఘ్వీ 72 వేల 5 వందల కోట్లతో 9 స్థానంలో ఉన్నారు. ఇక గౌతమ్‌ అదానీ 66 వేల కోట్ల రూపాయల సంపదతో టాప్‌ టెన్‌ ప్లేస్ లో ఉన్నారు.