దేశానికే లాజిస్టిక్స్ హబ్ గా మారుస్తాం

హైదరాబాద్ ను విశ్వనగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో రెండు బృహత్తర పథకాలకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే వస్తువులను ఇతర ప్రదేశాలకు తరలించేందుకు, అవసరమైన ముడిసరుకులను దిగుమతి చేసుకొనేందుకు రెండు లాజిస్టిక్స్ పార్కుల నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య పద్ధతిలో రంగారెడ్డి జిల్లా బాటసింగారంలో రూ.35 కోట్లతో 40ఎకరాల విస్తీర్ణంలో ఒకటి.. మంగళ్‌పల్లిలో రూ.20కోట్లతో 20ఎకరాల్లో మరొక పార్కును నిర్మించేందుకు మంత్రి కేటీఆర్‌ భూమి పూజ చేశారు. ఈ కార్యకక్రమానికి మంత్రి మహేందర్‌ రెడ్డితో పాటు భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌, ఇబ్రహింపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌ రెడ్డి, హెచ్‌ఎమ్ డీఏ కమిషనర్ చిరంజీవులు హాజరయ్యారు.

హైదరాబాద్‌ను దేశానికే లాజిస్టిక్ హబ్ గా మారుస్తామన్నారు మంత్రి కేటీఆర్‌. సరుకు రవాణాకు అనువైన ప్రాంతం హైదరాబాదు మాత్రమేనని చెప్పారు. లాజిస్టిక్‌ పార్కులకు రైల్, రోడ్డుతో పాటు విమానయానాన్ని అనుసంధానం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరానికి తగిన మౌళిక వసతులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు మంత్రి కేటీఆర్‌. అందుకే ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ‌ మరో 340 కిలోమీటర్ల రీజినల్ రింగ్ రోడ్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

ఆర్టీసీకి నిధులు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు మంత్రి మహేందర్‌ రెడ్డి. బడ్జెట్‌లో వెయ్యి కోట్లు కేటాయించి ఆర్టీసీని ఆదుకున్నారని గుర్తు చేశారు. గూడ్స్ రవాణ కోసం రెండు లాజిస్టిక్ పార్కులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

ఈ ప్రాజెక్టులతో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మందికి ఉపాధి దొరకనుంది. అలాగే రాబోయే రోజుల్లో నగరానికి చుట్టుప్రక్కల మరో 10 పార్కులను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది.