త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్

డీఎస్సీ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం.. దీపావళి కానుక ప్రకటించింది. అతి త్వరలో 8,792 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. 31 జిల్లాల ప్రకారమే డీఎస్సీ నోటిఫికేషన్ వేసేందుకు సమాయత్తం అవుతున్న ప్రభుత్వం.. అందులో భాగంగా ఇప్పటికే జిల్లాలవారీగా ఉన్న ఖాళీల వివరాలను తెప్పించుకుంది. విద్యాశాఖ సేకరించిన ఖాళీల వివరాల జాబితా, ఉపాధ్యాయ నియామక ప్రక్రియకు సంబంధించిన ఫైలు టీఎస్పీఎస్సి కి చేరింది. ఇప్పటికే టీచర్‌ పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ కూడా ఆమోదం తెలిపింది.

31 జిల్లాల ప్రకారంమే టీచర్ పోస్టుల భర్తీ చేసేందుకు న్యాయశాఖ ఆమోదం తెలిపింది. సీఎం కేసీఆర్ కూడా ఆమోదం తెలిపిన నేపథ్యంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి 31 జిల్లాల ప్రకారం టీచర్  నియామకాలను చేపట్టడానికి సంబందించిన ఫైల్ పై సంతకం చేశారు. ఆ వెంటనే నియామక నిబంధనలతో జీవో 25ను విడుదల చేశారు. 31 జిల్లాల వారీగా ఉన్న టీచర్  పోస్టుల ఖాళీలు, రోస్టర్  పాయింట్ల వివరాల సేకరణలో ఇప్పటికే సర్వీస్  కమిషన్  అదికారులు నిమగ్నమయ్యారని విద్యాశాఖ ఉన్నతాధికారులు పేర్కొన్నరు. సిలబస్ రూపకల్పన, పరీక్ష నిర్వహణ సర్వీస్  కమిషన్  ఆధ్వర్యంలోనే జరుగుతుందని, గురుకులాల్లో టీచర్  పోస్టుల కోసం నిర్వహించిన పరీక్షల మాదిరిగానే ఈ టీచర్ల భర్తీ పరీక్షలు కూడా ఉంటాయని చెప్పారు.  టీఎస్ పీఎస్ సీ సర్వసభ్య సమావేశంలో ఎంపిక విధానంపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నరని సమాచారం. ఎస్ ఏ, ఎస్జీటీ, పండిట్ల పోస్టులకు మూడు వేర్వేరు పరీక్షలు నిర్వహించనున్నరు.

డీఎస్సీ 2017 రూల్స్ లో.. అభ్యర్ధులకు ఉండాల్సిన అర్హతలు, టెట్ వెయిటేజ్, రిజర్వేషన్‌, నియామక ప్రక్రియ, తదితర నిబంధనలు ఉన్నాయి. డిస్ట్రిక్ట్‌ సెలక్షన్ కమిటీ స్థానంలో జిల్లాను ఒక యూనిట్ గా తీసుకుని, డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తారు. డిగ్రీ, పీజీ స్థాయిలో సంబంధిత సబ్జెక్టుల్లో  50శాతం మార్కులు.. ఎస్సీ, ఎస్టీ, డిసేబుల్డ్ పర్సన్స్ ఐతే 45 శాతం మార్కులు కలిగి ఉండాలి. లేదా నాలుగు సంవత్సరాల బీఏ, బీఎడ్ పూర్తిచేసి ఉండాలి. దీంతోపాటు తెలంగాణ ఎలిజిబిలిటీ టెస్ట్, ఏపీ టెట్, సెంట్రల్  టెట్  లో పాసైనవారు డీఎస్సీ రాసేందుకు అర్హులుగా ప్రకటించింది. షెడ్యూల్డ్  ఏరియాలో ఆ తెగలకు సంబంధించిన వారినే నియమిస్తారు.

మరోవైపు రాష్ట్ర వ్యవసాయ, సహకారశాఖలో భారీ సంఖ్యలో కొలువుల భర్తీకి టీఎస్ పీఎస్ సీ  నోటిఫికేషన్  ఇచ్చింది.  851 వ్యవసాయ విస్తరణ అధికారుల -ఏఈవో గ్రేడ్-2 పోస్టుల భర్తీకి సంబంధించిన ప్రకటనను విడుదలచేసింది. సమగ్ర సమాచారం కోసం తమ వెబ్‌ సైట్‌ ను సందర్శించాలని టీఎస్‌పీఎస్సీ సూచించింది. ఈ నెల 13వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారు. వ్యవసాయాన్ని దండుగకాదు… పండుగగా మార్చుతామని చెప్పిన సీఎం కేసీఆర్.. ఆ దిశగా వ్యవసాయశాఖను తీర్చిదిద్దుతున్నారు.