టీ20 టైటిల్ పోరు బురదలో కలిసింది

భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగాల్సిన టీ20 సిరీస్ టైటిల్ పోరు బురదలో కలిసింది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో చివరి మ్యాచ్ హైదరాబాద్ ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ స్టేడియంలో ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో కొన్ని రోజులుగా వరుసగా వర్షాలు కురుస్తుండటంతో ఉప్పల్ స్టేడియం చిత్తడిగా మారింది. పిచ్ వరకు కవర్లు కప్పి కాపాడినా.. ఔట్ ఫీల్డ్ తడిగానే ఉంది. సాయంత్రం ఏడు గంటలకు మ్యాచ్ ప్రారంభించాల్సి ఉండగా అప్పటికి కూడా ఫీల్డ్ సానుకూలంగా మారలేదు. ఈలోగా అభిమానుల్ని అలరించేందుకు భారత ఆటగాళ్లు కాసేపు ప్రాక్టీస్ చేశారు.

సాయంత్రం ఆరు గంటల నుంచే హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తున్నా ఉప్పల్ మాత్రం వర్షం లేదు. రాత్రి 8.30 వరకు ఎదురుచూసినా పరిస్థితిలో మార్పు రాలేదు. ఔట్ ఫీల్డ్ అనుకూలంగా లేకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో, మూడు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భారత్-ఆస్ట్రేలియా 1-1తో సమం అయ్యాయి. మ్యాచ్ రద్దయినట్టు ప్రకటించడంతో సాయంత్రం నాలుగు గంటల నుంచే స్టేడియంలో ఎదురుచూస్తున్న క్రికెట్ అభిమానులు నిరాశతో వెనుతిరిగారు.