టీ20 టైటిల్ పోరుకు భారత్-ఆసిస్ రెడీ!

భారత్‌ లో ఆసీస్‌ పర్యటన క్లైమాక్స్‌ కు చేరుకున్నది. రెండు జట్ల చివరి టీ20 మ్యాచ్‌ కు.. హైదరాబాద్‌ లోని రాజీవ్‌ గాంధీ స్టేడియం ముస్తాబైంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇరు జట్లు చెరోటి నెగ్గడంతో.. హైదరాబాద్‌ మ్యాచ్‌తోనే సిరీస్‌ ఫలితం తేలనున్నది. భారత్‌ గడ్డపై టెస్ట్‌, వన్డే సిరీస్‌లను కోల్పోయిన ఆస్ట్రేలియా, టీ20 సిరీస్‌ అయినా దక్కించుకోవాలని కసితో ఉన్నది. రాంచీలో ఓడిపోయినా.. గువహటిలో గెలుపుతో.. టీమిండియాకు సవాల్‌ విసురుతున్నది ఆసీస్‌. అయితే గత కొన్ని రోజులుగా   హైదరాబాద్‌ లో తిష్టవేసిన వరుణుడితో.. మ్యాచ్‌ ఎంతవరకు సాగుతుందో అనేది  ప్రశ్నార్థకంగా మారింది.

తొలి రెండు టీ20 మ్యాచ్‌ల ఫలితంతో సంబంధం లేకుండా మూడో మ్యాచ్‌ జరిగే ఛాన్స్‌ ఉన్నది. గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగబోతున్న రెండు జట్లు నెట్‌ ప్రాక్టీస్‌లో తీవ్రంగా శ్రమించాయి. ఆస్ట్రేలియాపై అన్ని విభాగాల్లో ఆధిక్యత కనబర్చిన టీమిండియా.. గత మ్యాచ్‌లో బ్యాటింగ్‌, బౌలింగ్‌ లోనూ స్థాయికి తగ్గ ప్రదర్శన  కనబర్చలేదు. దాంతో  ఈ మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా కోహ్లీ సేన బరిలోకి దిగబోతుంది. రోహిత్‌, ధావన్‌, కోహ్లీ, హార్ధిక్‌లతో బ్యాటింగ్‌ విభాగం పటిష్టంగా ఉండగా.. బౌలింగ్‌ లో మాత్రం భువీ కీలకంగా మారిండు. అయితే  హైదరాబాద్‌లో తుది జట్టులో మార్పులు చేసే అవకాశం ఉంది. వెటరన్‌ నెహ్రాతో పాటు అక్షర్‌, దినేష్‌ కార్తీక్‌లను ఆడించే అవకాశం ఉన్నది.

ఆసీస్‌ మాత్రం.. కొత్త కెప్టెన్‌ వార్నర్‌ నాయకత్వంలో టీమిండియాకు గట్టి సవాల్‌  విసురుతోంది. గువహటిలో భారత్ పై గెలుపు గాలివాటం కాదని నిరూపించాలంటే..  హైదరాబాద్‌లో  గెలవడం తప్పనిసరి అని ఆసీస్‌  మేనేజ్‌మెంట్  భావిస్తున్నది. ఐపీఎల్‌ సన్‌ రైజర్స్‌ కెప్టెన్‌ వార్నర్‌కు ఉప్పల్‌  పిచ్‌ కొట్టినపిండి కావడంతో.. హైదరాబాద్‌లో  గెలుపుతో  సిరీస్‌ను కైవసం చేసుకోవాలని స్కెచ్‌  వేస్తున్నది. బ్యాటింగ్‌ లో వార్నర్‌,  ఫించ్‌, హెడ్‌ హెన్రికేస్‌ సత్తా చాటుతుండగా.. బౌలింగ్‌ లో గత మ్యాచ్‌ హీరో బెహ్రన్‌ డ్రాఫ్‌ పై మరోసారి ఆశలు పెట్టుకున్నది. డ్రాఫ్‌తో పాటు జంపా, కల్టర్‌ నైల్‌ రాణిస్తే ఆసీస్‌ కు తిరుగుండదు.

ఇరు జట్ల సమరోత్సాహం ఎలా  ఉన్నా..  వర్షంతో మూడో టీ20 జరుగుతుందా.. లేదా  అన్నది ప్రశ్నగా మారింది. గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌ లో భారీ వర్షాలు పడుతుండడంతో.. అవుట్ ఫీల్డ్‌ చిత్తడిగా మారింది. ఇక గత వారం ముంబైతో జరగాల్సిన రంజీ మ్యాచ్‌ కూడా వర్షంతో రద్దై పోయింది. దాంతో  హెచ్‌సిఎ అధికారులు పిచ్‌ను ఇప్పటికే కవర్లతో కప్పి ఉంచారు. ఒక వేళ వర్షం వచ్చినా.. మ్యాచ్‌ను ఎలాగైనా  కొనసాగించాలనే ప్రణాళికతో  హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధికారులు ఉన్నారు.