టీ-హబ్‌ను ప్రపంచంలో నంబర్ వన్ చేస్తాం

టీ-హబ్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్‌గా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి కేటీఆర్. ఇందుకోసం టీ-హబ్ కార్యకలాపాలను మరింతగా విస్తరిస్తామని చెప్పారు. టీ-హబ్ ద్వారా ఇప్పటికే ఎన్నో స్టార్టప్‌లకు ఊతమందించామని తెలిపారు. ఐడియాతో రండి – ప్రోడక్ట్ తో తిరిగి వెళ్లండన్న కాన్సెప్టుతో టీ-హబ్ విజయవంతంగా నడుస్తోందని చెప్పారు. ఢిల్లీలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించిన ఇండియా ఎకనామిక్ సమ్మిట్‌కు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వం పరిశ్రమలకు అందిస్తున్న ప్రోత్సాహకాల గురించి సమావేశంలో వివరించారు.

దేశంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్ టీ-హబ్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించామని మంత్రి కేటీఆర్ చెప్పారు. మార్కెట్లోకి కొత్తగా వస్తున్న కంపెనీలకు టీ-హబ్‌లో ఇన్వెస్టర్లను పరిచయం చేస్తున్నామని తెలిపారు. సామాన్య ప్రజల సమస్యలకు స్టార్టప్‌లతో పరిష్కారాలు చూపిస్తున్నామన్న కేటీఆర్.. అందులో భాగంగా తయారు చేసిన ఆర్టీఏ ఎం-వ్యాలెట్ యాప్‌కు మంచి ఆదరణ లభించిందన్నారు. ఆంట్రప్రెన్యూర్లకు ప్రభుత్వాలు మౌలిక వసతులు, ఇతరత్రా సదుపాయాలు మాత్రమే కల్పించగవలన్న ఆయన.. స్టార్టప్‌ ఫండింగ్‌ అనేది ప్రైవేటు రంగం నుంచి రావాలని అభిప్రాయపడ్డారు. మంచి ఐడియాల కోసం ఎదురుచూసే ఇన్వెస్టర్లకు ఈ ప్రపంచంలో కొదవలేదని చెప్పారు. కాబట్టి పిల్లలను ఇప్పటి నుంచే ఇన్నోవేషన్ రంగం వైపు నడిపిస్తే.. భవిష్యత్‌లో మంచి అవకాశాలుంటాయని కేటీఆర్ వివరించారు.

అంతకుముందు మంత్రి కేటీఆర్ పలువురు పారిశ్రామిక వేత్తలతో భేటీ అయ్యారు. గోద్రేజ్ గ్రూప్ చైర్మన్ ఆది గోద్రెజ్, ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ క్రిస్ గోపాలకృష్ణన్, రీన్యూ పవర్ చైర్మన్ సుమంత్ సిన్హా,  అవాడా గ్రూప్ చైర్మన్ వినీత్ మిట్టల్‌తో పాటు మరికొంత మంది పారిశ్రామిక దిగ్గజాలను కలిశారు. పరిశ్రమలకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, రాయితీలు, టీఎస్ ఐపాస్ గురించి వారికి వివరించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కేటీఆర్ వారందరినీ ఆహ్వానించారు. అందుకు పారిశ్రామికవేత్తలంతా సానుకూలంగా స్పందించారు.