టీవీ యాంకర్, నటి మల్లిక కన్నుమూత

ప్రముఖ టీవీ యాంకర్, నటి మల్లిక (39) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, గత 20 రోజులుగా బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో కోమాలోనే ఉన్నారు. ఆమె అసలు పేరు అభినవ. మహేష్‌ బాబు కథానాయకుడిగా నటించిన ‘రాజకుమారుడు’ సహా పలు చిత్రాల్లో ఆమె పాత్రలు పోషించారు. 1997-2004 మధ్యకాలంలో పలు టెలివిజన్‌ ఛానళ్లలో ప్రసారమైన కార్యక్రమాలకు యాంకర్ గా ఆమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఉత్తమ యాంకర్‌ గా అవార్డులను సైతం అందుకున్నారు. పెళ్లి తర్వాత యాంకరింగ్, నటనకు దూరమయ్యారు. అంత్యక్రియల కోసం మల్లిక భౌతికకాయాన్ని రేపు ఉదయం  హైదరాబాద్‌ కు తరలించనున్నారు.