టీబీజీకేఎస్ ను గెలిపించినందుకు ధన్యవాదాలు

సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని, ముఖ్యమంత్రి హోదాలో తాను చెప్పిన ప్రతిదాన్ని నెరవేరుస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. సింగరేణి ఎన్నికల్లో టీఆర్ఎస్ అనుబంధ సంస్థ టీబీజీకేఎస్ ను గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. హైదరాబాద్ లోని ముఖ్యమంత్రి అధికార నివాస ప్రాంగణం ప్రగతి భవన్ లో కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. కారుణ్య నియామకాల రూపంలో వారసత్వ ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు.

రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో విచిత్ర పరిస్థితి ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో ఎవ్వరైనా ప్రజాప్రతినిధులు చనిపోతే సానుభూతి చూపిస్తారు, కానీ మన రాష్ట్రంలో ఎక్కడ ఎన్నిక జరిగినా టిఆర్ఎస్ ను ఆఖండ మెజార్టీతో గెలిపించారని చెప్పారు. మెదక్ ఉప ఎన్నిక మొదలు.. పాలేరు ఉప ఎన్నిక వరకు ప్రతి ఎన్నికలో తామే అధిక మెజారిటీతో గెలిచామని వివరించారు. బీజేపీ వాళ్ళు పొద్దున లేవంగానే టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అన్నారని, సింగరేణి ఎన్నికల్లో వాళ్లకు వచ్చిన ఓట్లు మొత్తం 200 పైచిలుకు మాత్రమేనని ఎద్దేవా చేశారు.

సింగరేణి ఎన్నికల్లో టీబీజీకేఎస్ 45 శాతానికి పైగా ఓట్లు సాధించిందని సీఎం కేసీఆర్ చెప్పారు. 11 డివిజన్లలో 9 డివిజన్లలో తాము ఘన విజయం సాధించామన్నారు. చరిత్రలో ఇంత పెద్ద మెజారిటీతో ఏ సంఘం గెలిచిన దాఖలాలు లేవని గుర్తుచేశారు. గతంలో తాము ఐదు డివిజన్లలో మాత్రమే గెలిచామన్నారు.

సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం తరఫున ప్రతి డివిజన్ కు ప్రతినిధులను తానే నియమిస్తానని సీఎం కేసీఆర్ చెప్పారు. వాళ్లతో నెలకు రెండు గంటలు సమీక్షిస్తానని చెప్పారు. అండర్ గ్రౌండ్ మైన్స్ లో నష్టాలు వచ్చినా ఇంకా ఆరు గనులు త్వరలో ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. బయ్యారం ఐరన్ ఓర్ గనులు తవ్వాల్సి వస్తే సింగరేణికే ఇస్తామన్నారు. ఇంకా విదేశాల్లో కూడా బొగ్గు గనులు తవ్వేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. ఆర్టీసీలో కార్మికులకు మేనేజ్ మెంట్ బోర్డులో అవకాశం ఇచ్చినట్టే సింగరేణిలో కూడా కార్మికులకు ప్రాతినిధ్యం కల్పిస్తామన్నారు. సింగరేణి, ఆర్టీసీలకు గత ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయని, ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని ప్రభుత్వ రంగ సంస్థలుగానే ఉంచుతామని స్పష్టం చేశారు.

సింగరేణి ఉద్యోగులు దయచేసి ఉద్యోగ విరమణలో తప్పులు చేయవద్దని సీఎం కేసీఆర్ కోరారు. వాళ్లు ఉద్యోగాలు అమ్ముకోవడం వల్లనే అలియాస్ పేర్లతో కార్మికులు ఉద్యోగాలు చేస్తున్నారని చెప్పారు. అందుకే వారసత్వ ఉద్యోగం వద్దనుకునే కార్మికులకు 25 లక్షల రూపాయలు ఏకమొత్తంలో ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు.