జలాశయాలకు పోటెత్తుతున్న వరద

రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకున్నాయి. వరద నీటితో జలాశయాలన్నీ కనువిందు చేస్తున్నాయి. ఏ ప్రాజెక్టు చూసినా అందమైన జలదృశ్యమే కనిపిస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. వరద నీటితో రాష్ట్రంలోని ప్రాజెక్టులకు జలకళ వచ్చింది. జలాశయాలన్నీ నిండుకుండల్లా మారుతున్నాయి. వరద నీరు పోటెత్తుతుండటంతో ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

నిజామాబాద్‌ జిల్లా వరప్రదాయని శ్రీరామ్‌సాగర్‌ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1073.30 అడుగులుగా ఉంది. పూర్తి స్థాయి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు అయితే.. ప్రస్తుతం 35.800 టీఎంసీల నీరు వచ్చి చేరింది. 19 వేల 500 క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో ఉండగా.. 5 వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు.

ఇక జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో 1 లక్షా 9 వేల క్యూసెక్కుల ఇన్‌ ఫ్లో నమోదవుతోంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 318.39 మీటర్లకు నీరు చేరుకుంది. మొత్తం 5.691 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 96 వేల 684 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. అటు ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి కూడా భారీగా వరదనీరు వస్తోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 148 అడుగులు కాగా.. ప్రస్తుతం ప్రాజెక్టులో 147.83 అడుగుల మేర నీరుంది. 5 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. ఎల్లంపల్లిలోకి ఇన్ ఫ్లో 9 వేల 447 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 5 వేల 586 క్యూసెక్కులుగా నమోదవుతోంది.

నాగార్జున సాగర్ ప్రాజెక్టు వరద నీటితో కళకళలాడుతోంది. జలాశయం కెపాసిటీ 590 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 526.20 అడుగులుగా ఉంది. నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు అయితే.. ప్రస్తుతం 159 టీఎంసీల నీరు చేరింది. 74 వేల 413 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.. 1 వెయ్యి 350 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అటు మూసీ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 645 అడుగులు కాగా.. ప్రస్తుతం 644.20 అడుగుల వరద నీరు చేరింది. 2 వేల 200 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా.. అంతే మొత్తంలో నీటిని దిగువకు వదులుతున్నారు.

ఇటు రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలు నిండుకుండల్లా తొణికిసలాడుతున్నాయి. ఉస్మాన్ సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1,790 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1,781 అడుగులుగా ఉంది. అటు హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.5 అడుగులు అయితే.. ప్రస్తుతం 1755.20 అడుగుల మేర నీరు చేరింది.

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలోని కోయిల్ సాగర్ వరద నీటితో కళకళలాడుతోంది. పుష్కర కాలం తర్వాత ప్రాజెక్టు మళ్లీ పూర్తిస్థాయిలో నిండింది. ఫుల్ కెపాసిటీ 32 అడుగులకు నీరు చేరడంతో, గేట్లు ఎత్తి 10 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం కోయిల్‌ సాగర్‌లో 2.50 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు జలదృశ్యాన్ని ఆవిష్కరిస్తోంది. పూర్తి స్థాయి నీటిమట్టం 523.60 మీటర్లు కాగా.. ప్రస్తుతం 523.45 మీటర్ల నీరు చేరింది. ప్రాజెక్టు కెపాసిటీ 29.917 టీఎంసీలు అయితే.. 29.048 టీఎంసీల నీటితో సింగూరు జలకళను సంతరించుకుంది. ఇన్ ఫ్లో 2,508 క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1,883 క్యూసెక్కులుగా రికార్డవుతోంది. ప్రాజెక్టులన్నీ వరద నీటితో నిండిపోవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.