చైనా సరిహద్దులో రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటన

రక్షణ మంత్రిగా తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్నారు నిర్మలా సీతారామన్. శనివారం నాడు సిక్కింలోని నాథులా సరిహద్దును సందర్శించిన సమయంలో చైనా సైనికులను పలకరించారు. ఆ సమయంలో ఆసక్తికరమైన సన్నివేశం చోటు చేసుకుంది. చైనా సైనికులను నమస్తే అంటూ నవ్వుతూ పలకరించారు నిర్మలా సీతారామన్. నమస్తే అంటే అర్ధం తెలుసా అంటూ చైనా సైనికులను ప్రశ్నించారు.  దాంతో వారు కొంత కన్ఫ్యూజన్ కు గురయ్యారు. కొద్దిసేపటి తర్వాత ఒక చైనా సైనికుడు నవ్వుతూ.. నమస్తే అంటే మిమ్మల్ని కలిసినందుకు ఆనందంగా ఉందని అర్థం అని చెప్పాడు. నమస్తేను మీ భాషలో ఏమంటారు? అని సీతారామన్‌ ప్రశ్నించగా.. ని హావ్‌ అంటారని చైనా సైనికులు సమాధానమిచ్చారు. ఈ వీడియోను రక్షణ మంత్రిత్వ శాఖ తన ట్విటర్‌ లో పోస్టు చేసింది. మరోవైపు ఆదివారం అస్సాంలోని తేజ్‌పూర్‌ ఎయిర్‌ బేస్‌ వద్ద సైనిక సన్నద్ధతపై సీనియర్‌ ఆర్మీ, ఎయిర్‌ ఫోర్స్‌ అధికారులతో సీతారామన్‌ సమీక్షించారు.