చెంచు గ్రామంలో పుట్టినరోజు జరుపుకున్న స్పీకర్

అసెంబ్లీ స్పీకర్ మధుసూదన చారి తన పుట్టిన రోజు వేడుకలు చెంచుల మధ్య నిరాడంబరంగా జరుపుకున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం చెంచు కాలనీలో భారీ కేక్ కట్ చేశారు. మూడు సంవత్సరాల క్రితం వరకు అభివృద్ధి చిరునామా తెలియని అట్టడుగు వర్గాల జీవితాల్లో వెలుగులు నింపే చిరు ప్రయత్నం చేశారు. వారి జీవితాల్లో వెలుగును నింపేవరకు కృషి చేస్తానని అన్నారు.

ఈ సందర్భంగా గ్రామంలోని చెంచు కుటుంబాలకు ఇండ్ల పొజిషన్ సర్టిఫికెట్లతో పాటు పట్టాలు అందజేశారు. గ్రామంలో మొత్తం 49 కుటుంబాలకు గాను 32 మందికి పొజిషన్ సర్టిఫికెట్స్, 17 మందికి ఇళ్ల పట్టాలను ఇచ్చారు. ఆరు నెలల్లోనే వారికి పూర్తి స్థాయి ఇళ్లను నిర్మించనున్నట్టు స్పీకర్ మధుసూదనాచారి తెలిపారు. వీరికి రూరల్ డెవలప్ మెంట్ ట్రస్ట్ ఇళ్లను నిర్మించి ఇవ్వనున్నది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నవనీత్ రావు, జాతీయ బీసీ సంక్షేమ అధికార ప్రతినిధి రాగిఫనని రవీంద్ర చారి, శిశు సంక్షేమ ఆర్గనైజర్ భారతి రెడ్డి, ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.