ఘనంగా అలయ్ బలయ్

కేంద్ర మాజీ మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో అలయ్-బలయ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్స్ రాజ్ గంగారాం, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె.కేశవరావు, టిఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత జితేందర్ రెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, పలు రాజకీయ పార్టీల నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

2022 సంవత్సరం లోపల తెలంగాణ నంబర్ వన్ రాష్ట్రం కావాలని బండారు దత్తాత్రేయ ఆకాంక్షించారు. రైతుల ఆత్మహత్యలు లేని తెలంగాణ కావాలన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్నేహపూర్వక వాతావరణంలో సమస్యల పై చర్చలు జరుపుకోవాలని సూచించారు. ఇకపై అలయ్ బలయ్ ని తెలంగాణ వ్యాప్తంగా నిర్వహిస్తామని ప్రకటించారు.

దత్తన్న అలయ్ బలయ్ తో కొత్త మానవీయ కోణాన్ని ఆవిష్కరించారని మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక ఏ పండుగ అయినా సరే ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని చెప్పారు.

దత్తాత్రేయకు కేంద్రమంత్రి పదవిలో ప్రమోషన్ వస్తుందనుకుంటే.. ఉన్న పదవిని తీసేసి అన్యాయం చేశారని కాంగ్రెస్ ఎంపీ వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన మాటలతో టిఆర్ఎస్ నేత కేకే ఏకీభవించారు. దత్తన్నకు అన్యాయం జరిగింది వాస్తవమే అన్నారు. దత్తన్న చాలా గొప్పవాడని, ఆయన్ని ఒక్క సామాజిక వర్గానికి పరిమితంగా మాట్లాడొద్దని సూచించారు. దత్తన్న స్థాయి తాను ఢిల్లీలో చూశానని, ఆయనకు భవిష్యత్ లో ఎవరూ ఉహించని పోస్ట్ రావటం ఖాయమని కేకే ఆశాభావం వ్యక్తం చేశారు.