గోద్రా రైలు కేసులో  హైకోర్టు కీలక తీర్పు

గోద్రా రైలు దహనం కేసులో గుజరాత్‌ హైకోర్టు సోమవారం కీలక తీర్పు వెల్లడించింది. ఈ కేసులో 11 మంది దోషులకు పడిన ఉరిశిక్షను జీవితఖైదుకు తగ్గిస్తూ న్యాయస్థానం తీర్పు చెప్పింది. కాగా.. రైలు దహన ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.10లక్షలు చొప్పున పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో ప్రభుత్వం విఫలమైందంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆరు వారాల్లోగా బాధిత కుటుంబాలకు ఈ నష్టపరిహారాన్ని చెల్లించాలని సూచించింది. 2002 ఫిబ్రవరి 27న గుజరాత్‌లోని గోద్రాలో ఈ ఘటన చోటుచేసుకున్న విషయం తెలిసిందే. అయోధ్య నుంచి అహ్మదాబాద్‌కు వస్తున్న సబర్మతీ ఎక్స్‌ప్రెస్‌పై గోద్రా స్టేషన్‌ వద్ద ఆందోళనకారులు దాడి చేశారు. ప్రయాణికుల్లో చాలా మంది విశ్వహిందూ పరిషత్‌ తరఫున అయోధ్యలోని పూర్ణాహుతి మహా యాగంలో పాల్గొని తిరిగివస్తున్నారు. ఆ సమయంలో దాదాపు 2000వేల మంది ఆందోళనకారులు ప్రయాణికులపై రాళ్ల దాడికి దిగారు. అనంతంరం నాలుగు బోగీలకు నిప్పంటించారు. ఈ ప్రమాదంలో 59 మంది మృతిచెందారు. వీరిలో 27 మంది మహిళలు, 10 మంది చిన్నారులున్నారు. గోద్రా రైలు దహనం ఘటన నేపథ్యంలో రాష్ట్రంలో పెద్దఎత్తున అల్లర్లు చోటుచేసుకున్నాయి. రోజుల తరబడి జరిగిన ఈ హింసాత్మక ఘటనల్లో 1000 మందికి పైగా ప్రజలు చనిపోయారు