గొర్రెల పంపిణీ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం

రాష్ట్రంలోని గొల్ల-కురుమలకు ఇప్పటిదాకా 23.80 లక్షల గొర్రెలను పంపిణీ చేశామన్నారు సీఎం కేసీఆర్. 84 లక్షల గొర్రెలను ఎక్కడనుండి తెచ్చి పంపిణీ చేస్తారని ఎద్దేవా చేసినవారికి ఇది సమాధానమన్నారు. ఇప్పటికే దాదాపు 24 లక్షల గొర్రెలు పంపిణీ చేయడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని తెలిపారు. హైదరాబాద్ లో జరుగుతున్న అఖిలభారత కురుమల సమావేశానికి వచ్చిన అన్ని రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ ను కలిశారు. రాష్ట్రంలో గొల్ల-కురుమల సంక్షేమానికి ప్రభుత్వం చేపట్టిన పథకంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ను ప్రత్యేకంగా అభినందించారు. సీఎంను కలిసినవారిలో కర్నాటక మంత్రులు రేవన్న, బందప్ప.. ఎమ్మెల్యే ప్రకాష్ వార్తుర్, మహారాష్ట్ర మంత్రులు  మహాదేవ జంకార్, రాం షిండే.. ఎమ్మెల్యే వీ రామారావు, ఢిల్లీ వాటర్ బోర్డ్ వైస్ చైర్మన్ దినేష్ మొహారియా; తమిళనాడు కురుమ సంఘానికి చెందిన ఆర్. కృష్ణమూర్తి, రాష్ట్ర MBC కార్పొరేషన్ ఛైర్మన్ తాడూరి శ్రీనివాస్ వున్నారు. వీరితో పాటు రాష్ట్ర పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమ, ముఖ్యకార్యదర్శి సురేష్ చందా, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి,  తెలంగాణ కురుమ సంఘం అధ్యక్షుడు ఎగ్గే మల్లేశం తదితరులు వున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక పథకాల పట్ల, ముఖ్యంగా బీసీలు, గొల్ల-కురుమల కోసం చేపట్టిన పథకాలపై వివిధ రాష్ట్రాల కురుమ ప్రతినిధులు  సంతోషం వ్యక్తం చేశారు. తమ కమ్యూనిటీకి సీఎం కేసీఆర్ సర్కార్ మద్ధతు ఇవ్వడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలుపరుస్తున్న పథకాల గురించి సీఎం కేసీఆర్ వారికి వివరించారు. ప్రజలకు మేలు చేస్తే అంతా మేలు జరుగుతుందనీ, కేవలం మాటలతో కాలం వెళ్ళబుచ్చడం సరైంది కాదన్నారు. తాను ప్రజా జీవితంలో 40 సంవత్సరాలకు పైగా ఉన్నాననీ, తెలంగాణ కోసం పోరాడాననీ, అందుకే ప్రజలకు ఏం చేయాలనే విషయంలో స్పష్టత వుందన్నారు. తెలంగాణ కోసం పోరాడుతున్న రోజుల్లో తాను గంటల తరబడి దేశంలోని అన్ని పార్టీల నాయకులకు రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను గురించి వివరించేవాడినని తెలిపారు. 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితంగా సాధించిన తెలంగాణ రాష్ట్రంలో తాము అధికారంలో వచ్చిన తరువాత ప్రజల కొరకు ఏం చేస్తే మంచిదో బాగా ఆలోచించామన్నారు.  తెలంగాణ గురించి అర్థం చేసుకోవడానికి చాలా అధ్యయనం  చేశామనీ, అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఆ అధ్యయనం కొనసాగిందనీ వివిధ రాష్ట్రాల కురుమ ప్రతినిధులతో సీఎం అన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వాలు ప్రజలకు మేలే చేసినట్లయితే విచారపడాల్సిన అవసరం లేదని, కాని, అలా జరగలేదని ఆయన అన్నారు. ప్రకృతి మనకిచ్చిన అపార సంపదతో మన దేశంలో-రాష్ట్రంలో ఉత్పత్తి చేయలేందేదీ లేదని, అలాంటప్పుడు ఆ అవకాసం సద్వినియోగం చేసుకోవడం మంచిదనీ ఆయన చెప్పారు.

యాదవ కమ్యూనిటీ దేశంలో కొట్లలో వుందనీ, అయినా మాంసం దిగుమతి చేసుకుంటున్నామని వివిధ రాష్ట్రాల కురుమ ప్రతినిధులతో సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణలో 35-40 లక్షల మంది గొల్ల-కురుమలున్నారానీ, వారి వృత్తి ప్రధానంగా గొర్రెల పెంపకమనీ, అయినా సుమారు 650 లారీల మాంసం రాష్ట్రం దిగుమతి చేసుకుంటున్నదన్నారు.  ఒక్క హైదరాబాద్ నగరానికే వేరే రాష్ట్రాల నుండి సుమారు 350 లారీల గొర్రెలను ప్రతిరోజూ దిగుమతి చేసుకుమ్తున్నామనీ, ఇది సిగ్గుపడాల్సిన విషయమన్నారు. ఇది పోవాలంటే ఏం చెయ్యాలనే విషయంలో తామంతా సుదీర్ఘంగా చర్చించిన తరువాత రు. 4,500 కోట్ల ప్రణాళిక రూపొందించామనీ సీఎం వారికి చెప్పారు. ఆ పథకం ప్రకారం రెండేళ్ళ వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 84 లక్షల గొర్రెలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. దీనిలో భాగంగా ఇప్పటికి 23. 80 లక్షల గొర్రెలను పంపిణీ చేసామని చెప్పారు. తమ గొర్రె కాపరుల కమ్యూనిటీనే తమ అసలు-సిసలైన మానవ వనరులని..అందుకే వాటి అభివృద్ధికి కంకణం కట్టుకున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. రెండేళ్ళ తరువాత హైదరాబాద్ నగరంలో అఖిల భారత షఫర్డ్ కమ్యూనిటీ సభలు జరుపుతామనీ, అప్పటికి ప్రపంచంలోనే అతి ధనవంతమైన కమ్యూనిటీగా తెలంగాణ షఫర్డ్ కమ్యూనిటీ రూపుదిద్దుకుంటుందన్నారు.

గతంలో వ్యవసాయాన్ని ఎవరూ సరిగ్గా అర్థం చేసుకోలేదనీ, పట్టించుకోలేదనీ సీఎం కేసీఆర్ అన్నారు. అందుకే రైతుల ఆత్మహత్యలు జరిగేవన్నారు. అయితే మొట్టమొదటి సారిగా తెలంగాణ రైతులను సంఘటితపరిచే చర్యలకు శ్రీకారం చుట్టామని, అందులో భాగంగా రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేశామనీ వివిధ రాష్ట్రాల కురుమ ప్రతినిధులతో సీఎం చెప్పారు. ఎకరానికి రు. 8000 పెట్టుబడి కూడా వచ్చే ఏడాది నుంచి ఇస్తామన్నారు. షఫర్డ్ కమ్యూనిటీ బాగుపడి, రైతు బాగుపడి, పాల విక్రయదారులు బాగుపడి, ఇలా ఒక్కొక్కరూ బాగుపడితే రాష్ట్రం కూడా బాగుపడి ఆర్థికంగా బలపడుతుందని సీఎం అన్నారు. అటు గొల్ల-కురుమల సంఘం వసతి గృహానికి పదెకరాల స్థలం, పది కోట్ల రూపాయల సహాయం ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. అలాగే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి గెలిచే అవకాశం లేని వెనుకబడిన తరగతుల వారికి శాసన మండలిలో ప్రాతినిధ్యం కలిగించే ఆలోచన వుందని సీఎం చెప్పారు. తనను కలవటానికి వచ్చిన ప్రతినిధులందరితో కలసి  ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్  మధ్యాహ్న భోజనం చేశారు.