కోలుకుంటున్న భాగ్యనగరం

 

భారీ వర్షంతో అతలాకుతలమైన హైదరాబాద్‌ శరవేగంగా సాధారణ స్థితికి చేరుకుంది..! ప్రభుత్వ శాఖలు, జీహెచ్‌ఎంసీ అధికారుల సమన్వయంతో పనిచేయడంతో నగర ప్రజలకు ఇబ్బందులు తప్పాయి..! సీఎం కేసీఆర్‌ స్వయంగా మానిటరింగ్ చేయడంతో అధికార యంత్రాంగం యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టింది..! జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆయా శాఖల ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించారు..!  విదేశీ పర్యటనలో ఉన్న మేయర్ బొంతు రామ్మోహన్ సహాయ చర్యలను సమీక్షించగా, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ పలుప్రాంతాల్లో పర్యటించారు..! జీహెచ్‌ఎంసీకి చెందిన 140 మాన్‌సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, 50 స్టాటిక్ బృందాలు వరద నీరు నిలువకుండా చర్యలు తీసుకున్నాయి..!  జీహెచ్‌ఎంసీలో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూం ద్వారా సీసీ టీవీలు, డయల్ 100, జీహెచ్‌ఎంసీ కాల్ సెంటర్, మై జీహెచ్‌ఎంసీ యాప్ తదితర మార్గాల్లో అందిన ఫిర్యాదులపై ఉన్నతాధికారులు స్పందిస్తూ తగిన నివారణ చర్యలు చేపట్టారు..! అటు ట్రాఫిక్ జాం కాకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు..! విద్యుత్ నిలిచిపోయిన ప్రాంతాల్లో శరవేగంగా విద్యుత్ ను పునరుద్దరించారు.

మరోవైపు నీట మునిగిన కాలనీలు, బస్తీల్లో వ్యాధులు ప్రబలకుండా జీహెచ్‌ఎంసీ పారిశుద్ధ్య, ఎంటమాలజీ విభాగాలు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాయి..! 14 వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి 800 మందికిపైగా వైద్యపరీక్షలు నిర్వహించారు..!  సింగాడికుంట, అంబర్‌పేట బగ్గీఖానా, హబ్సిగూడ, శివరాంపల్లి, ప్రభాకర్‌జీ కాలనీ తదితర బస్తీల వాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించి భోజన సదుపాయం కల్పించారు. నీట మునిగిన ప్రాంతాల్లో  మంగళవారం ఐదు వేల ఆహార పొట్లాలను పంపిణీ చేశారు..!  వర్షాలకు 85 చెట్లు కూలిపోగా జీహెచ్‌ఎంసీ బయోడైవర్సిటీ విభాగం ఎప్పటికప్పుడు తొలిగించింది..! ప్రమాదాలకు ఆస్కారమున్న శిథిల భవనాలను తొలగించారు..! ఇక పాతబస్తీలో కరెంట్‌షాక్‌తో మరణించిన వ్యక్తికి విద్యుత్‌శాఖ రూ.4 లక్షలు, గోడకూలి మరణించిన ఇద్దరికి మేయర్ సహాయ నిధి నుంచి రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.