కోదండరాం విషపూరిత వ్యక్తి

కోదండరాం తనను తాను ఎక్కువగా ఊహించుకుంటున్నాడని సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు. కోదండరాం ఎప్పుడైనా సర్పంచ్ అయ్యిండా, ఆయనకు ఏం తెలుసని ప్రశ్నించారు. టిఆర్ఎస్ పట్ల పూర్తి విషపూరిత వ్యక్తి కోదండరాం అని విమర్శించారు. కోదండరాం కు మొదటి నుంచి టిఆర్ఎస్ పై వ్యతిరేకత ఉందన్నారు. ఉద్యమ సమయంలో కూడా కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, దిగ్విజయ్ సింగ్ లతో ఢిల్లీ వెళ్లి రహస్య మంతనాలు జరిపాడని గుర్తుచేశారు. కాంగ్రెస్ లో పలువురికి టికెట్లు ఇప్పించింది, ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో రాసిందే కోదండరాం అని వివరించారు. కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టు.. ఆయన మాటలు నమ్మే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేసి నిండా మునిగిందని చెప్పారు.

కోదండరాం అమరుల స్ఫూర్తి యాత్ర అని బయలెల్లిండని, మొత్తం 500 మంది కూడా ఎక్కడా రాలేదని ఎద్దేవా చేశారు. ఏ ముఖం పెట్టుకొని ఆయన అమరుల స్ఫూర్తియాత్ర చేస్తున్నాడని ప్రశ్నించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లిని హుజూర్ నగర్ లో పోటీ పెడితే ఎందుకు మద్దతివ్వలేదని నిలదీశారు. ఎప్పుడైనా ఏ అమరుడి కుటుంబాన్ని అయినా పరామర్శించిండా అని ప్రశ్నించారు. తెలంగాణ ఎవరి పాలాయెరా, ఎవరు పాలిస్తున్నారురా అని కోదండరాం యాత్రకు పాట పెట్టుకొని తిరుగుతున్నాడని సీఎం కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ కోసం పద్నాలుగేళ్లు పోరాడినోళ్లే, తెలంగాణ సాధించినోళ్లే, ప్రజలు ఎన్నుకున్నోళ్లే రాష్ట్రాన్ని ఏలుతున్నారని స్పష్టం చేశారు. కోదండరాం కు ఎందుకంత బాధ అని ప్రశ్నించారు.

తెలంగాణలోని రాజకీయ పక్షాలన్నీ ఏకం కావాలన్న ఉద్దేశంతో తానే కాంగ్రెస్ నేత జానారెడ్డి ఇంటికి వెళ్లి జేఏసీ ఏర్పాటు చేద్దామని ఆనాడు చెప్పానని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. జేఏసీ పేరు పెట్టిందే తాను అని.. జేఏసీకి కర్త, కర్మ, క్రియ అన్నీ తానేనన్నారు. జేఏసీ చైర్మన్ గా జయశంకర్ సార్ ని ఉండమంటే ఆయన కోదండరాం పేరుని సూచించారని గుర్తుచేశారు. సాగరహారం మొదలు అనేక రకాలుగా చేసిన ఉద్యమాల్లో టిఆర్ఎస్ కార్యకర్తలే ముందున్నారని, పదవులు త్యాగం చేసిన పార్టీ, తెలంగాణ తెచ్చింది ముమ్మాటికీ టీఆర్ఎస్ మాత్రమేనన్నారు. కోదండరాం ఎవ్వరు? నేను తయారు చేసిన కార్యకర్తలలో ఒక్కడన్నారు. కోదండరాం ను మీడియానే పాపులర్ చేసిందని చెప్పారు.

జేఏసీ పేరు పెట్టుకునే నైతిక హక్కు కోదండరాంకు లేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఆనాడు ఉద్యమం కోసం జేఏసీ ఏర్పాటు చేశామని, అందులో రాజకీయ పార్టీలు, ఉద్యోగ, న్యాయవాద, ప్రజాసంఘాలు ఉండేవని గుర్తుచేశారు. ఈ జేఏసీలో ఎవరున్నారని ప్రశ్నించారు. కోదండరాం నలుగురు పోరగాళ్లను వెంటబెట్టుకొని జేఏసీ అంటే చెల్లుతుందా అన్నారు. రాజకీయంగా ఎదుర్కోవాలంటే నేరుగా రావాలని సూచించారు. గత ఎన్నికల్లో  టికెట్ ఇస్తానంటే ఆయనేదో పెద్ద సిపాయి అనుకొని రాలేదని ఎద్దేవా చేశారు. ఇటువంటి వాళ్ళు చాలామంది వస్తారని, అలాంటి వారిని పట్టించుకోకుండా తమకు సహకరించాలని సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కోదండరామ్ బాధేంటో అర్థం కావట్లేదని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రభుత్వం అభివృద్ధి పనులు ఆయనకు బాధ, బతుకమ్మ చీరలు పంచితే బాధ, పింఛన్లు ఇస్తే బాధ, ప్రాజెక్టులు కడితే బాధ.. ఇంత అక్కసు దేనికి ఆయనకు అంటూ ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ పెట్టడమంటే పాన్ డబ్బా పెట్టటం కాదని సీఎం కేసీఆర్ అన్నారు. చిరంజీవి పార్టీ పెట్టిండు ఏమైందని గుర్తుచేశారు. కోదండరాం కూడా రాజకీయాలు చేయాలంటే పార్టీ పెట్టాలని సూచించారు. ఆయనకు రాజకీయ బీమార్ తప్ప మరేం లేదని ఘాటుగా విమర్శించారు.